వీరమల్లుతో ఆడిపాడనున్న రంగమ్మత్త?

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28 కి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసే సంకల్పంతో నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ పనులు వేగవంతం చేస్తున్నారు. మరోపక్క విఎఫెక్స్ కు సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా మరో టీమ్ పర్యవేక్షిస్తోంది. డిప్యూటీ సిఎం అయ్యాక క్షణం తీరిక దొరకనంత బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ నెలల గ్యాప్ తర్వాత సెట్లోకి అడుగు పెట్టారు. ఇటీవలే ఒక యాక్షన్ ఎపిసోడ్ తో చిత్రీకరణ పునఃప్రారంభించారు. మరో కీలక అప్డేట్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం హరిహర వీరమల్లులో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ మెరవనుందని సమాచారం. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో దీన్ని గతంలోనే షూట్ చేశారట. అధికారికంగా చెప్పలేదు కానీ ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఒక మాస్ డ్యాన్స్ నంబర్ దీని కోసమేనని అంటున్నారు. గతంలో అత్తారింటికి దారేదిలో పబ్ సాంగ్ చేయమన్నప్పుడు అనసూయ నో చెప్పడం, దానికి సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారం రేగడం అప్పటి జనాలకు గుర్తే. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ తో జట్టు కట్టే ఛాన్స్ రావడమంటే లక్కీనేగా. ఆ మధ్య ఒక రియాలిటీ షోలో ఈ వార్తని అనసూయ స్వయంగా చెప్పిన క్లిప్ వైరలయ్యింది.

రంగస్థలంలో రామ్ చరణ్, గాడ్ ఫాదర్ లో చిరంజీవితో కలిసి నటించిన అనసూయకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేయడంతో ఫుల్ సర్కిల్ పూర్తయ్యింది. ఉపముఖ్యమంత్రిగా పవన్ నుంచి రాబోయే మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ హంగామా దీనికి మాములుగా ఉండదు. హైప్ పరంగా ఓజినే ముందున్నప్పటికీ రాబోయే రోజుల్లో హరిహర వీరమల్లు పబ్లిసిటీని భారీ ఎత్తున ప్లాన్ చేయడం ద్వారా బజ్ పెంచే ప్లానింగ్ జరుగుతోంది. అధిక భాగం క్రిష్ డైరెక్షన్ చేసిన ఈ హిస్టారికల్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా బాబీ డియోల్ విలన్ గా మరో ప్రాముఖ్యత ఉన్న పెద్ద పాత్ర దక్కించుకున్నాడు.