పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే పవన్‌కు ఫ్యాన్. వచ్చాక అభిమానం ఇంకా పెరిగింది. పవన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాక నాయకుడిగానూ పవన్ మీద తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నాడు నాని.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయనకు వ్యతిరేకంగా హీరోలు నోరు మెదిపేవారు కాదు. కానీ నాని మాత్రం టికెట్ల ధరలను తగ్గించడం మీద పవన్ కళ్యాణ్‌తో గళం కలిపాడు. అంతే కాక ఎన్నికల ముంగిట పవన్ పార్టీ గెలవాలని పోస్టు కూడా పెట్టాడు. దీంతో నాని గట్స్ ఉన్న హీరో అంటూ పవన్ ఫ్యాన్స్ అప్పట్లో అతణ్ని కొనియాడారు. ఇప్పుడు పవన్ మీద మరోసారి తన అభిమానాన్ని చాటాడు నాని. రానా దగ్గుబాటి టాక్ షోలో అతను పవన్ పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడాడు.
“పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా ఏంటి అన్నది మనకు అందరికీ తెలుసు. సినిమాల్లో ఉన్నంత వరకు ఆయన ఒక మిస్టిక్ పర్సనాలిటీ. పవర్ స్టార్.. హీరో.. పెద్ద స్టార్. కానీ రాజకీయాల్లోకి వచ్చాక మనిషి వ్యక్తిగతంగా ఏంటో తెలిసిందనే ఫీలింగ్ వచ్చేసింది. పవన్ గొప్ప వ్యక్తి” అని నాని వ్యాఖ్యానించాడు.
ఈ షోలో ఇంకా పలు అంశాల గురించి నాని మాట్లాడాడు. ఇటీవల ఐఫా వేడుకల్లో రానా, తేజ సజ్జా వేరే హీరోల మీద వేసిన పంచ్ డైలాగుల మీద అభిమానులు ఫీలై సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసిన నేపథ్యంలో నాని మాట్లాడుతూ.. తెలుగు హీరోలందరూ చాలా సరదాగా ఉంటారని, వాళ్లు జోక్స్‌ను ఈజీగా తీసుకుంటారని నాని వ్యాఖ్యానించడం విశేషం. ఈ ఎపిసోడ్ త్వరలోనే అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates