‘లక్కీ భాస్కర్’ దర్శకుడికి నాగి, హను ఆడిషన్

దర్శకులు కొన్నేళ్ల జర్నీ తర్వాత నటులవుతుంటారు. అలాగే నటులు కొన్నేళ్ల అనుభవం వచ్చాక దర్శకత్వం మీద ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. వెంకీ అట్లూరి అనే కుర్రాడు రెండో కోవకు చెందుతాడు. ఐతే అతడికి నటుడిగా పెద్దగా అనుభవం, గుర్తింపు ఏమీ లేవు. మధుర శ్రీధర్ రెడ్డి తీసిన ‘స్నేహగీతం’లో అతను హీరో పాత్ర చేశాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఒక పాట మాత్రం బాగా పాపులర్ అయింది.

ఐతే వెంకీ తర్వాత నటుడిగా కనిపించలేదు. రైటర్‌గా కొన్ని సినిమాలకు పని చేసి.. ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా రావడానికి ముందు అతడిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ‘తొలి ప్రేమ’తో ఆశ్చర్యపరుస్తూ పెద్ద హిట్ కొట్టాడు. తర్వాతి రెండు చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దె నిరాశపరిచినా.. ‘సార్’తో మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. లేటెస్ట్‌గా ‘లక్కీ భాస్కర్’తో విమర్శకులను మెప్పించడంతో పాటు కమర్షియల్ సక్సెస్ కూడా సాధించాడు.

ఈ సినిమా సక్సెస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్లు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి ముఖ్య అతిథులుగా రాగా.. వాళ్లిద్దరూ తనను నటుడిగా ఆడిషన్ చేసిన విషయాన్ని వెంకీ గుర్తు చేసకున్నాడు. నాగి.. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌గా పని చేయగా, చంద్రశేఖర్ యేలేటికి హను రాఘవపూడి శిష్యుడు. యేలేటి చేసిన ఓ సినిమాకు గాను హను.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కోసం నాగి తనను ఆడిషన్ చేసినట్లు వెంకీ వెల్లడించాడు. ఐతే నటుడిగా తనను ప్రేక్షకులతో పాటు వాళ్లూ అంగీకరించలేదని వెంకీ చమత్కరించాడు.

ఐతే నాగి, హను ఇద్దరూ దుల్కర్ సల్మాన్‌తో సినిమాలు (మహానటి, సీతారామం) చేసి హిట్లు కొట్టారని.. ఇప్పుడు తాను ‘లక్కీ భాస్కర్’తో హిట్ అందుకున్నానని.. ఇప్పుడు తాము ముగ్గురం కలిసి ఒకే స్టేజ్ మీద నిలబడ్డామని.. ఇది అరుదైన విషయమని వెంకీ అన్నాడు. దీపావళి కానుకగా రిలీజైన ‘లక్కీ భాస్కర్’ మంచి వసూళ్లతో సాగుతోంది.