35 ఏళ్ళ తర్వాత ‘మగాడు’గా రాజశేఖర్

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఆ మధ్య నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లో కనిపించాక మళ్ళీ తెరమీద దర్శనం ఇవ్వలేదు. అంతకు ముందు గడ్డం గ్యాంగ్, శేఖర్ అంటూ సోలో ప్రయత్నాలు కొన్ని చేశారు కానీ ఆడియన్స్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అవి కంటెంట్ లో లోపాలు తప్పించి ఆయన మీద నెగటివ్ అభిప్రాయమేమి లేదు. అయితే సరైన కంబ్యాక్ పడితే మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలున్న రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక థియేటర్ మూవీ చేస్తున్నారు. దానికి మగాడు టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు సమాచారం. దీని వెనుక ఆసక్తికరమైన సంగతులున్నాయి.

మగాడు గతంలో రాజశేఖర్ టైటిలే. 1990 సంవత్సరంలో జీవిత సమర్పణలో మలయాళం బ్లాక్ బస్టర్ మూన్నం మూర రీమేక్ గా రూపొందింది. షూటింగ్ టైంలో జరిగిన ప్రమాదం వల్ల రాజశేఖర్ గాయపడితే కొంత కాలం బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత కొనసాగించారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయ్యింది. మొదలైన యాభై నిమిషాల తర్వాత హీరో ఎంట్రీ ఇచ్చే అతి కొద్ది చిత్రాల్లో మగాడు నిలిచిపోయింది. కేవలం రెండు పాటలతో, రెగ్యులర్ హీరోయిన్ లేకుండా, ఒక కిడ్నాప్ డ్రామా చుట్టూ దర్శకుడు కె మధు దీన్ని ఆసక్తికరంగా రూపొందించారు. ఆగస్ట్ లో రిలీజై మంచి విజయం అందుకుంది.

అంతకు ముందు స్వర్గీయ ఎన్టీఆర్ దీవార్ రీమేక్ సైతం మగాడు అనే పేరుతోనే వచ్చింది. ఆ మధ్య మహేష్ బాబు కోసం ఓసారి ఈ టైటిల్ అనుకున్నారు కానీ ఎందుకనో డ్రాప్ అయ్యారు. ఇప్పుడు తిరిగి రాజశేఖర్ వాడుకుంటున్నారు. ఆయనకే కాదు దర్శకుడు పవన్ సాధినేనికి సైతం దీని సక్సెస్ చాలా కీలకం. ఓటిటిలో హిట్లు కొడుతున్నప్పటికీ థియేట్రికల్ రిలీజ్ ద్వారా విజయం అందుకోవాలని చూస్తున్నారు. దీంతో పాటు పవన్ సాధినేని దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండూ పెద్ద బ్రేక్ ఇస్తే టాప్ లీగ్ లో ఉన్న హీరోల నుంచి పిలుపులొస్తాయని వెయిట్ చేస్తున్నారు.