డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో ఒక సినిమా ఉండబోతోందని, దానికి సంబంధించిన ప్రకటన ఏ నిమిషమైనా రావొచ్చని హఠాత్తుగా ఒక వార్త చక్కర్లు కొట్టడంతో నందమూరి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇటీవలే మోక్షజ్ఞ డెబ్యూని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీని మీదే తన పూర్తి ఫోకస్ ఉండాలని వాళ్ళ కోరిక. బాలకృష్ణ చెప్పేది కూడా అదే. అసలే సినిమాటిక్ యునివర్స్ పేరిట మహాకాళి, అధీరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నాడు. మళ్ళీ కొత్తవి ఒప్పుకుంటే వీటి మధ్య బ్యాలన్స్ తప్పొచ్చు.
ఏతావాతా తేలిందేంటంటే ఇదంతా పుకారేనట. ప్రస్తుతం ఇచ్చిన కమిట్మెంట్ల ప్రకారం ఇప్పట్లో ఈ కలయిక సాధ్యం కాదు. ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి చేయాలి. ఆ తర్వాత స్పిరిట్ లో బిజీ అవుతాడు. తనకు విడిగా డేట్లు ఇమ్మని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ అడిగాడని, దానికి డార్లింగ్ ఒప్పుకున్నాడని టాక్ ఉంది. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. వీటికి ఎంతలేదన్నా మూడేళ్లకు పైగానే టైం పడుతుంది. ఇటు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తర్వాత జై హనుమాన్ ని తెరకెక్కించాలి. బ్రాండ్ అండ్ మార్కెట్ దృష్ట్యా వేరేవాళ్లకు అప్పగించడానికి లేదు. తను డైరెక్ట్ చేస్తేనే బిజినెస్ జరుగుతుంది.
సో ఆన్ లైన్లో ఊరికే రేగిన గాసిప్ ఇంత పని చేసిందన్న మాట. ఒకవేళ నిజమైతే సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ఫ్లాపుల్లో ఉన్న మారుతీనే నమ్మినప్పుడు హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ దర్శకుడికి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ప్రాక్టికల్ కోణంలో చూస్తే సాధ్యమయ్యే ఛాన్స్ లేదని అర్థమవుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే అక్టోబర్ 23 తేలిపోతుంది కానీ అప్పటిదాకా ఫ్యాన్స్ నిశ్చింతగా ఉంటే చాలు. అయినా సోషల్ మీడియాలో ఇలాంటి కాంబోల గురించి చిన్న లీక్ వస్తే చాలు దావానలంగా అల్లుకుపోతోంది. అందులోనూ ప్రభాస్ గురించి అయితే చెప్పేదేముంది.