తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం.. ఈ క్రమంలో గత ఏడాది హైదరాబాద్‌లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నాగార్జునను కావాలనే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వర్గం ఆయనపై మండిపడితే.. ప్రభుత్వం సరైన పనే చేసిందంటూ ఇంకో వర్గం వాదించింది. దీనిపై నాగార్జున తర్వాతి రోజుల్లో ఎలా స్పందిస్తాడా.. కోర్టులో ఎలా పోరాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే నెమ్మదిగా వ్యవహారం సద్దుమణిగిపోయింది. ఇటీవల తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి.. తర్వాత మిస్ ఇండియా ఈవెంట్ సందర్భంగా రేవంత్‌ను కలిసి ఆయనతో సన్నిహితంగా కనిపించారు నాగ్.
కాగా ఇప్పుడు సీఎం రేవంత్ నాగార్జున గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చి వేత గురించి సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను చెరువు పరిధిలో ఉందనే కూల్చివేశామని రేవంత్ స్పష్టం చేశారు. ఆ సమయంలో చాలామంది విమర్శలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఐతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ పని చేసిందని అర్థం చేసుకున్న నాగార్జున.. తర్వాత అక్కడున్న రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి తన పెద్ద మనసును చాటుకున్నారని కొనియాడారు రేవంత్ రెడ్డి. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో తమది రాజీ లేని విధానం అని రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలోని బతుకమ్మ కుంటలో ఆరు ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసుకున్నారని.. దాని మీద కాంగ్రెస్ నేతలు ఎప్పట్నుంచో పోరాడుతున్నారని… ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా చేస్తోందని ఆయనన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates