మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు చాలామందిలో ఉంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, ఒత్తిడితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు.
రాత్రి భోజనం చేసిన తరువాత కనీసం పది నిమిషాలైనా నడవాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే నిటారుగా కూర్చోవడం అవసరం. పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. ఫలితంగా అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ స్థాయిలు కూడా వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల డయాబెటిస్ రావచ్చని హెచ్చరిస్తున్నారు.
తిన్న తర్వాత కొద్ది నిమిషాలు నడిస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శరీరంలోని మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం ఎనర్జీగా మారిపోతుంది. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యలు ఉన్నవారికి వాకింగ్ చేయడం చాలా మంచిది. ఇది పేగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు సహజ నిద్రకు కూడా తోడ్పడుతుంది.
తిన్న తరువాత రోజూ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవడం హార్ట్ హెల్త్ కు కూడా మంచిది. తిన్న తర్వాత పది నిమిషాలు నడవడం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు హాయిగా మారుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. బీపీ సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.
తిన్న వెంటనే పడుకుంటే నిద్ర సరిగా రాదు. శరీరం జీర్ణక్రియపై పనిచేస్తుండడంతో నిద్రలో అంతరాయం కలుగుతుంది. కానీ వాకింగ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. మంచి నిద్ర వస్తుంది. ప్రత్యేకంగా డయాబెటిస్ , నిద్రలేమి లాంటి సమస్యలు ఉన్నవారు ఈ అలవాటు తప్పనిసరిగా పెట్టుకోవాలి. తిన్న తర్వాత నడవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటుగా మార్చుకోవడం ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates