రాహుల్ గాంధీ.. మరోసారి నోరు జారాడా

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రం మ‌హారాష్ట్ర‌. ఇండియా మొత్తంలో ల‌క్షా 50 వేల దాకా కేసులుంటే.. 50 వేల కేసులు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయంటే తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు. అక్క‌డ కొన్నాళ్లుగా రోజూ వంద మందికి త‌క్కువ కాకుండా చ‌నిపోతున్నారు.

లాక్ డౌన్‌ను స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డంలో, ప్ర‌జ‌ల్ని జాగృతం చేయ‌డంలో, కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల్ని ప‌క్కాగా అనుస‌రించ‌డంలో శివ‌సేన-కాంగ్రెస్ సంకీర్ణ స‌ర్కారు నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించడం వ‌ల్లే క‌రోనా ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయికి చేరింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

పోలీసుల్లోనే వెయ్యి మంది క‌రోనా బారిన ప‌డ్డారంటే ఇందులో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం స్ప‌ష్టం. దేశంలోనే అత్య‌ధిక జ‌న‌సాంద్ర‌త ఉన్న ధారావి మురికివాడ విష‌యంలోనూ ముందు జాగ్ర‌త్త లేక‌పోవ‌డంతో అక్క‌డ క‌రోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే విమ‌ర్శ‌ల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఐతే ఈ విష‌యంలో నింద త‌మ‌పైకి రాకుండా ఉండేందుకు ప్ర‌భుత్వ‌ భాగ‌స్వామ్య పార్టీ కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది.

ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అందుకు నిద‌ర్శనం. తాము పంజాబ్, రాజ‌స్థాన్ లాంటి రాష్ట్రాల్లో నిర్ణ‌యాధికారం తీసుకునే స్థానంలో ఉన్నామ‌ని.. మ‌హారాష్ట్ర‌లో తాము కీల‌క నిర్ణ‌యాల్లో భాగ‌స్వాములుగా లేమ‌ని స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్.

ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంటూ.. ఇప్పుడో పెద్ద ఉప‌ద్ర‌వం వ‌చ్చేస‌రికి రాహుల్ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లే రాహుల్ త‌ర‌చుగా నోరు జారి ట్రోల్ అవుతుంటాడు. తాజా వ్యాఖ్య‌ల‌తో మ‌రింత‌గా విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. శివ‌సేన నుంచి కూడా అత‌డి వ్యాఖ్య‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.