ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచడంతో పాటు ఉద్యోగావకాశాలు సృష్టిస్తాయని అంచనా వేస్తోంది. అవే విశాఖపట్నంలో వండర్‌లా, తిరుపతిలో ఇమాజికా వరల్డ్.
అన్నీ సక్రమంగా జరిగితే విశాఖపట్నంలో 50 ఎకరాల్లో వండర్‌లా థీమ్ పార్క్, తిరుపతిలో 20 ఎకరాల్లో ఇమాజికా వరల్డ్ ఏర్పాటు కానుంది. ఈ రెండు సంస్థలను విజయవంతంగా ఆకర్షించామని టూరిజం శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.
అత్యంత ప్రజాదరణ పొందిన థీమ్ పార్క్ చైన్‌లలో ఒకటైన వండర్‌లాకు విశాఖపట్నంలో 50 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. అలాగే ప్రపంచ స్థాయి వినోద సదుపాయాలకు పేరుగాంచిన ఇమాజికా వరల్డ్‌కు తిరుపతిలో 20 ఎకరాల భూమి అవసరమని వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టూరిజానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో ఆతిథ్య మరియు వినోద మౌలిక సదుపాయాల ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు.
ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో టూరిజం శాఖ మొత్తం 26 జిల్లాల్లో రూ.28,977 కోట్ల విలువైన 209 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుందని అజయ్ జైన్ వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates