‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బుధవారం ఏపీ సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరును సీఎం ప్రశంసించారు. పరిపాలన అనుభవం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ చూపుతున్న చొరవ అభినందనీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ దిశగా పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని సీఎం తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ రోడ్ల నిర్మాణాల విషయంలో ఆయన తీసుకుంటున్న తక్షణ నిర్ణయాలను ఉదాహరణలతో వివరించారు. ఇటీవల అంధుల క్రికెట్ టోర్నీ విజేతలను అభినందించిన సందర్భంగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి తమ గ్రామానికి రహదారి వేయాలని కోరగానే వెంటనే నిధులు మంజూరు చేయడం పవన్ స్పందనకు నిదర్శనమని చెప్పారు. ఇదే తరహాలో మరో సంఘటనను కూడా కలెక్టర్ల సమక్షంలో ప్రస్తావించారు.
మంగళవారం కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసిన సందర్భంగా అల్లూరి జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడు తమ గ్రామానికి రహదారి కావాలని కోరగా, ఆ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మీటింగ్ ముగిసేలోగా రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేయించిన విధానాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. బాధ్యత గల ప్రభుత్వం అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రజల అవసరాలకు సద్వినియోగం చేయాలన్నదే తమ పాలన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates