సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సును ప్రత్యక్ష ప్రసారం చేయడం పాలనలో సరికొత్త ప్రయోగంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల నివేదికలు నేరుగా ప్రజల ముందుకు రావడంతో పాలనపై విశ్వాసం పెరుగుతోంది. ప్రజలే సాక్షులుగా ఉండే ఈ విధానం అధికార వ్యవస్థలో జవాబుదారీతనానికి బాట వేసింది.
లైవ్ ప్రసారం ద్వారా తమ జిల్లా కలెక్టర్ సీఎం ముందు ఏం చెబుతున్నారు? జిల్లాలోని సమస్యలు ఎలా ప్రస్తావనకు వస్తున్నాయి? అనే అంశాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయి వాస్తవాలను దాచే అవకాశం తగ్గుతోంది.
రాబోయే రోజుల్లో అమలుకానున్న పథకాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏవీ అన్నదానిపై కూడా ప్రజలకు అవగాహన కలుగుతోంది. డిజిటల్ సేవలు, ఉపాధి హామీ పనులు, ‘పల్లె పండుగ’ వంటి కార్యక్రమాల లక్ష్యాలను నేరుగా వినడం వల్ల ప్రజలు పాలనలో భాగస్వాములవుతున్నారు.
సదస్సులో ‘సర్వీస్ డెలివరీ’, ‘డిజిటల్ గవర్నెన్స్’పై సీఎం ఇస్తున్న స్పష్టమైన ఆదేశాలు సామాన్యుడికి ధైర్యం ఇస్తున్నాయి. కార్యాలయాల్లో పనుల కోసం మధ్యవర్తుల అవసరం లేదన్న నమ్మకం పెరుగుతోంది. ప్రజలే ప్రభువులు… మేము సేవకులం అన్న సందేశాన్ని లైవ్ ద్వారా ప్రభుత్వం బలంగా చాటుతోంది. పాలనను గడప దాటించి ప్రజల కళ్ల ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రయోగం పారదర్శక పాలనకు కొత్త అధ్యాయంగా నిలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates