అప్పుడు బాహుబలి.. ఇప్పుడు భరత్ అను నేను

అప్పుడు బాహుబలి.. ఇప్పుడు భరత్ అను నేను

లోక్‌సభలో కీలక సమయాల్లో మాట్లాడిన ప్రతిసారీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలుగు సినిమాలతో మొదలుపెట్టిన ఆసక్తికరంగా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. గత సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తిన ఆయన బాహుబలి సినిమాతో ప్రారంభించిన ఆయన తాజాగా అవిశ్వాసంపై చర్చను ప్రారంభిస్తూ ‘భరత్ అను నేను’ సినిమాతో ఉపన్యాసం ప్రారంభించారు.

ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి చనిపోవడంతో విదేశాల నుంచి వచ్చిన భరత్ అనే యువకుడు, అనూహ్య పరిస్థితుల్లో డైనమిక్ సీఎంగా మారతారని గుర్తు చేశాడు. తన తల్లి సూచించినట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయతే ప్రధానంగా పనిచేయడం కథాంశంగా చిత్రం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ప్రతిబింబించడంతోనే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిందని అన్నారు. ప్రస్తుత పాలకుల్లో అటువంటి విశ్వసనీయత కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఏ విధమైన హామీ నెరవేరలేదని, ఆయన ఇచ్చిన మాటను తప్పారని ఆరోపించారు.

అంతకుముందు తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అవిశ్వాసానికి మద్దతిచ్చిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా ఇతర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ విషయంల బీజేపీ వైఖరిని తూర్పారబడుతూ 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏపీ ఇష్యూ మొత్తం దేశానికే ఇష్యూగా మారిపోయిందని అన్నారు. ఇది బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం కాదని, ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధమని, మోదీ పాలనకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు.

ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గల్లా జయదేవ్ అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ప్రసంగిస్తున్నారు. గల్లా జయదేవ్ తిరుపతిలో మోడీ హామీని ప్రస్తావిస్తున్నప్పుడు తెలుగుదేశం ఎంపీలు వెంకటేశ్వరస్వామి పటాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి అన్యాయం చేశాయని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. విభజనకు ముందు ఎపికి హైదరాబాద్‌నుంచి సంపద ఉత్పత్తి అయ్యేదని ఆయన అన్నారు. విభజన తరువాత ఎపి అనేక రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు