ఆ ఊరు నాయకులకు పుట్టినిల్లు

క్రిష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని బందలాయి చెరువు అనే చిన్న ఊరు ఏపీలో ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అందరినీ ఆకర్షిస్తున్నది. ఎందుకంటే రాజకీయ చైతన్యానికి చిహ్నంగా ఉన్న ఆ ఊరు నుండి పలువురు రాజకీయ నేతలు తయారయ్యారు. అందుకే దానిని నాయకులకు పుట్టినిల్లు అని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో

మూడు సార్లు ఆవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ ఈ ఊరికి చెందినవారు కావడం విశేషం. మచిలీపట్నం లోక్ సభ స్థానం నుండి సింహాద్రి సత్యానారాయణ కుమారుడు, ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక ఆవనిగడ్డ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కావడం గమనార్హం. హైదరాబాద్ లో ఉంటున్న ఇదే ఊరికి చెందిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఈ ఎన్నికలలో పిఠాపురం శాసనసభ స్థానం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. సింహాద్రి ఇంటి పేరు గల ముగ్గురు ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తుండడం విశేషం.

ఇక వైసీపీ తరపున సత్తెనపల్లి నుండి గెలిచి, ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి, అంబటి రాంబాబు, ఈ ఎన్నికల్లో పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అంబటి మురళిల అమ్మమ్మ ఊరు ఇదే. వారు ఇక్కడే పుట్టి, బాల్యంలో ఇక్కడే పెరిగారు. గతంలో ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడిగా ఉండి ప్రస్తుతం టీడీపీ శాసనమండలి సభ్యుడిగా ఉన్న పర్చూరి అశోక్ బాబు సొంత ఊరు కూడా ఇదే కావడం గమనార్హం. అందుకే ఆ ఊరును నాయకులకు పుట్టినిల్లుగా భావిస్తున్నారు.