సానుభూతి ఎన్నికల్లో టఫ్ ఫైట్

దేశ‌వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నిక‌ల ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. పెరుగుతున్న ఎండ‌ల కంటే కూడా రాజ‌కీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఉండ‌టంతో ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ‌గానే ఉంది. ఇక తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్క‌డ విజ‌యం కోసం మూడు ప్ర‌ధాన పార్టీలు క‌స‌ర‌త్తుల్లో మునిగిపోయాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి స‌మ‌రానికి సై అంటున్నాయి.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దివంగ‌త నేత సాయ‌న్న త‌న‌య‌ లాస్య నందిత బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి దివంగ‌త ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ కూతురు వెన్నెల‌, బీజేపీ నుంచి శ్రీగ‌ణేష్ పోటీ చేశారు. ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో లాస్య నందిత క‌నుమూయ‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఇప్పుడు ఈ ఎన్నిక కోసం లాస్య నందిత సోద‌రి నివేదిత‌ను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. బీజేపీ నుంచి వ‌చ్చిన శ్రీగ‌ణేష్ కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యారు. ఇక బీజేపీ త‌మ అభ్య‌ర్థిగా వంశ తిల‌క్‌ను ప్ర‌క‌టించింది.

ఇక్క‌డ సానుభూతితో పాటు బ‌ల‌మైన క్యాడ‌ర్ కార‌ణంగా బీఆర్ఎస్ మ‌రోసారి గెలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సిటింగ్ స్థానాన్ని చేజార్చుకోవ‌ద్ద‌ని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో నిలిచిన శ్రీగ‌ణేష్ ఈ సారి మాత్రం వ‌ద‌ల‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఆయ‌న పోటీ చేయ‌డం క‌లిసొచ్చే అంశం. ఇక రాజ‌కీయాల‌కు కొత్త అయిన తిల‌క్‌ను బీజేపీ ఎంపిక చేసింది. తిల‌క్‌కు ఉన్న రాజ‌కీయ కుటుంబ నేప‌థ్య‌మే అందుకు కార‌ణం. తిల‌క్ తండ్రి టీవీ నారాయ‌ణ ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం పొందారు. త‌ల్లి స‌దాలక్ష్మి తొలి డిప్యూటీ స్పీక‌ర్‌గా, మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఇప్పుడు మూడు పార్టీల అభ్య‌ర్థుల ఖ‌రారు కావ‌డంతో కంటోన్మెంట్‌లో పోరు మ‌రింత హోరెత్త‌నుంది. మ‌రి విజ‌యం ద‌క్కేది ఎవ‌రికో చూడాలి.