సునీల్ మోజు తీరిపోయింది

సునీల్  మోజు తీరిపోయింది

కమెడియన్ గా కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో హీరోగా మారాడు సునీల్.  మొదట్లో ‘అందాల రాముడు’.. ‘మర్యాద రామన్న’.. ‘పూల రంగడు’.. లాంటి సినిమాలతో మంచి ఫలితాలే అందుకున్నాడు.

కానీ ‘పూల రంగడు’లో కొంచెం మాస్ టచ్ చూపించి సక్సెస్ అయిన సునీల్.. ఆ తర్వాత దాన్నే ప్రయారిటీగా చేసుకున్నాడు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి.. తనకు నప్పని సినిమాలు చేసి దెబ్బ తిన్నాడు. జనాల్లోనూ అతడి పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది. కామెడీ వేషాలు వదిలేసి.. హీరో పాత్రల మీద ఇంత మోజెందుకో అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. సునీల్ మళ్లీ కామెడీలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఐతే వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాక సునీల్ కు ఎట్టకేలకు తత్వం బోధపడ్డట్లుంది. ఇక తాను మారతానంటున్నాడు. మళ్లీ కామెడీ వేషాలు వేస్తానంటున్నాడు. అలాగని హీరో పాత్రలు వదలనని కూడా చెబుతున్నాడు. ‘‘హాస్యనటుడిగా వరుస సినిమాలు చేస్తున్నప్పుడే హీరో అవకాశం వచ్చింది. దాన్ని వదులుకోవడం ఇష్టం లేక కమెడియన్ పాత్రలకు దూరంగా వెళ్లాను. అయితే ఒకప్పట్లా నవ్వులు పండించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. త్వరలో కమేడియన్‌ గా సినిమాలు మొదలుపెడతాను. ఐతే హీరో పాత్రలు విడిచి పెట్టను. ఏడాదిలో హీరోగా రెండు సినిమాలు చేసుకుంటూ.. మిగతా సమయంలో హాస్యనటుడిగా అలరిస్తాను’’ అని చెప్పాడు సునీల్. మరి అతడికి మళ్లీ కామెడీ వేషాలు ఎవరిస్తారో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు