జ‌గ‌న్ చేసిన ప‌ని చూడు కేసీఆర్ సాబ్‌?

రాజకీయాల్లో మిత్రులైన తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ప‌రిపాల‌న స‌హా అనేక అంశాల గురించి పోలిక ఉండే సంగ‌తి తెలిసిందే . వివిధ అంశాల్లో ఈ ఇద్ద‌రు నేత‌ల నిర్ణ‌యాలు , వైఖ‌రి స‌హ‌జంగానే ప్ర‌జ‌లు విశ్లేషించుకునేందుకు చాన్స్ ఇస్తుంటాయి. ప్ర‌స్తుతం క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వ యొక్క వైఖ‌రి చ‌ర్చ‌కు తెర‌లేపింది.

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంపై ఆ రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలు పాటించడాన్ని ప‌రిశీలించి వాటిని ఉల్లంఘిస్తున్న గుంటూరులో 52 కొవిడ్ ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝులిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వాల‌న్న‌ ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ.1.25కోట్ల జరిమానా విధించారు. స‌హ‌జంగానే ఈ వార్త పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించింది. అదే స‌మ‌యంలో చ‌ర్చ‌కు తెర‌లేపింది.

హైద‌రాబాద్‌లో క‌రోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు హాస్పిట‌ల్ల‌లో అనేకం నిబంధ‌న‌లు య‌థేచ్చ‌గా ఉల్లంఘిస్తున్న సంగ‌తి తెలిసిందే. చికిత్స భారీ ఫీజులు వ‌సూలు చేయ‌డం నుంచి మొద‌లుకొని చ‌నిపోయిన వ్య‌క్తి కుటుంబానికి చివ‌రి చూపు కోసం శ‌వం అప్ప‌గించే వ‌ర‌కు రోజుకు ప‌దుల సంఖ్య‌లో వార్త‌లు మీడియాలో , సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. స‌ద‌రు బాధితుల ఆవేద‌న ఎంద‌రినో క‌లచివేస్తోంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ విష‌యంలో ప్ర‌భుత్వం చ‌ర్య‌లు శూన్యమ‌ని ప‌లువురు భ‌గ్గుమంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఏపీ స‌ర్కారు దూకుడుగా ముందుకు సాగి భారీ ఫైన్లు వేసింది. మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.