బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మూడు రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతడి అభిమానులతో పాటు అందరినీ కలచివేసింది. అతడికి మద్దతుగా సోషల్ మీడియాలో మూడు రోజులుగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. వారసులు, వారి మద్దతుదారులతో కూడిన బాలీవుడ్ మాఫియానే సుశాంత్ ఆత్మహత్యకు కారణమంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.
బాలీవుడ్లో వారసులు నెత్తిన పెట్టుకుని ప్రమోట్ చేస్తాడని పేరున్న కరణ్ జోహార్ మీద వాళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు రోజుల వ్యవధిలో కరణ్ జోహార్ ఫాలోవర్లు లక్ష మందికి పైగా తగ్గిపోవడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి నిదర్శనం. ఐతే ఇదే సమయంలో సుశాంత్ ఫాలోవర్లు అనూహ్యంగా పెరిగారు.
కేవలం మూడు రోజుల వ్యవధిలో సుశాంత్ ఇన్‌స్టా అకౌంట్లో 20 లక్షలకు పైగా కొత్త ఫాలోవర్లు జమ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. సుశాంత్ చనిపోవడానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫాలోవర్ల సంఖ్య 9.7 మిలియన్లు. ఐతే గత మూడు రోజుల్లో ఆ సంఖ్య ఏకంగా 11.8 మిలియన్లకు పెరిగింది. 20 లక్షల మందికి పైగానే ఈ మూడు రోజుల్లో కొత్త ఫాలోవర్లు వచ్చారు సుశాంత్‌కు. ఇప్పుడు సుశాంత్ అనేవాడే లేకున్నా.. అతడి నుంచి కొత్తగా ఏ అప్‌డేట్ రాదని తెలిసినా తన అకౌంటును కొత్తగా ఇంతమంది ఫాలో కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇది అతడికి సంఘీభావంగా నెటిజన్లు చూపిస్తున్న ప్రేమగా చెప్పొచ్చు. ఎవరైనా సుశాంత్ సన్నిహితులు ఈ అకౌంట్‌ను టేకప్ చేసి.. తన వ్యక్తిగత ఫొటోలు, ఇతర విశేషాలతో ఈ అకౌంట్‌ను మేనేజ్ చేసే అవకాశముంది. శ్రీదేవి సహా కొందరు దివంగత నటీనటుల అకౌంట్లను ఇలాగే వారి కుటుంబ సభ్యులు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.