ఒక దౌత్యాధికారి మీద తీవ్ర ఆరోపణలు రావటం.. ఒక సంపన్న దేశం వేలెత్తి చూపటం.. దానికి భారతదేశం తీవ్రంగా స్పందించటమే కాదు.. ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం.. ఈ సందర్భంగా సదరు హైకమిషనర్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ.. 35 ఏళ్లు ఆయనకు అనుభవం ఉంది.. అలాంటి వ్యక్తి మీద వేలెత్తి చూపుతారా? మీకెంత ధైర్యం? అంటూ విరుచుకుపడే భారత్ ను గతంలో ఎప్పుడూ చూసి ఉండరేమో? అలాంటి తీరును ప్రదర్శించటం ద్వారా భారత్ తీరుపై అందరూ మాట్లాడుకునేలా చేయటంలో ప్రధాని నరేంద్ర మోడీ కారణమైతే.. ఈ మొత్తం ఇష్యూలో ఇప్పుడు అందరూ చూపు పడిన వ్యక్తి కెనడాలోని భారత హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న సంజయ్ కుమార్ వర్మ. ఆయనతో పాటు.. పలువురు దౌత్యవేత్తలపై ట్రూడో సర్కారు అనుమానితులుగా పేర్కొనటం తెలిసిందే.
ట్రూడో సర్కారు నిర్ణయంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. నిరసనను వ్యక్తం చేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసు విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని సంజయ్ కుమార్ వర్మ స్పష్టంగా వివరిస్తున్న వేళ.. ఆయనకు మరక అంటించే ప్రయత్నం చేసింది ట్రూడో సర్కారు. ఇంతకూ ఆయన ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన దౌత్య జీవితంలో ఆయనేం చేశారు? అన్న ప్రశ్నలు అందరికి ఆసక్తిగా మారాయి.
1988 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అదేనండి ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి సంజయ్ కుమార్ వర్మ పట్నా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీలో ఫిజిక్స్ పట్టా పొందారు. ఐఎఫ్ఎస్ అధికారిగా హాంకాంగ్.. చైనా.. వియత్నాం.. తుర్కియే.. ఇటలీలో దౌత్య సేవలు అందించిన ఆయన రిపబ్లిక్ ఆఫ్ సూడాన్ లో ఇండియన్ అంబాసిడర్ గా పని చేవారు. విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శిగా.. అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. జపాన్.. మార్షల్ ఐలాండ్స్ లోనూ విధులు నిర్వర్తించిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. 2022 సెప్టెంబరులో కెనడా భారత హైకమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.
అలా.. ఆయనకు మూడు దశాబ్దాల పాటు దౌత్యపరమైన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. గత ఏడాది జూన్ లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురైన ఘటనలో బారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య కారణమైంది. కయ్యానికి కాలు దువ్విన కెనడాకు ఊహించని రీతిలో షాకిచ్చింది భారత ప్రభుత్వం. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్న వేళ.. సంజయ్ కుమార్ వర్మ అండ్ టీం అందిస్తున్న సేవలు చాలా కీలకమని చెప్పకతప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates