మూడు నెలల విరామం తర్వాత పెళ్లిళ్లకు మళ్లీ శుభ సమయం వచ్చేసింది. కొత్త ఏడాది వచ్చే వరకు ఇది పెళ్లి పండగల సమయమే అని పండితులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు ప్రతి రోజు పెళ్లిళ్ల కోసం పండుగ వాతావరణం నెలకొననుంది. శుభ ముహూర్తాలు తిరిగి రావడంతో బజా భజంత్రీలు మోగే సమయం దగ్గరపడింది.
పెళ్లి టైమ్ లో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా, అసలు తంతు మాత్రం కాస్త ఖర్చుతో కూడుకున్నది. పెళ్లి అంటే మన దేశంలో ఒక పెద్ద ఉత్సవం. సామాన్య ప్రజలు సైతం తమకు ఉన్న సదుపాయాలకు మించి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇది ఒక్క కుటుంబానికే కాదు.. దేశవ్యాప్తంగా భారీ ఆర్థిక వ్యవహారాలకు కూడా దోహదం చేస్తుంది.
2023లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయట. ఆ వేడుకల కోసం దాదాపు రూ. 4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సారి ఈ సంఖ్య 48 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే లెక్క అంతకుమించి అనేలా ఉండవచ్చు. సీఏఐటీ (CAIT) నివేదిక ప్రకారం, ప్రతి పెళ్లికి సగటున రూ.12 లక్షలు ఖర్చు అవుతోంది. దీంతో వివాహం వల్ల దేశంలో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.
ఈ సీజన్ లో ప్రధానంగా బంగారం, వెండి ఆభరణాలు, పెళ్లి పట్టు బట్టలు, వివిధ ఆహారాలు, ఫంక్షన్ హాళ్ల బుకింగ్ లతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. వివాహాల కారణంగా బంగారం కొనుగోళ్లలో 60 శాతం పెరుగుదల నమోదవుతోంది. అలాగే, టెక్స్‌టైల్ రంగంలో భారీ డిమాండ్ ఉంది. పెళ్లి దుస్తులు, పెళ్లి బట్టల మార్కెట్ పెరిగి, ఫ్యాషన్ డిజైనర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పెళ్లి ఖర్చులో ముఖ్యంగా కేటరింగ్ మరియు ఫంక్షన్ హాళ్ల ఖర్చు ప్రధానంగా నిలుస్తుంది.