‘టాటా’ పేరుకు సార్థ‌క‌త తెచ్చిన ర‌త‌న్!!

ర‌త‌న్‌.. ఇది వినేందుకు మూడు అక్ష‌రాలే అయినా.. ఆయ‌న కోసం దేశ ప్ర‌ధాని వేచి చూస్తారు. పుట్టి పెరిగారుకాబ‌ట్టి.. ఇక్క‌డ వ్యాపారాలు చేస్తున్నారు కాబ‌ట్టి.. భార‌త్‌లో ఆయ‌న‌కు ఆ మాత్రం గౌర‌వం ద‌క్క‌డం స‌హ‌జ‌మే. కానీ, ఎక్క‌డో ఉన్న దేశాలు.. ఖండ ఖండ‌తారాల్లో ఉన్న దేశాల్లోనూ ర‌త‌న్ టాటా అప్పాయింట్ మెంటు కోసం వేచి ఉండే దేశాధినేత‌లు.. అధ్య‌క్షులు ఉన్నారం టే ఆశ్చ‌ర్యం వేస్తుంది. మీరు త‌ప్ప‌కుండా రావాలి. మీకు కుదిరిన స‌మ‌యంలోనే నేను సింహాస‌నం అధిష్టాను అని బ్రిట‌న్ రాజ‌వంశం.. టాటా కుటుంబానికి క‌బురు పెట్టి.. ఎదురు చూసిందంటే.. టాటా పేరుకు ఉన్న సార్థ‌క‌త అర్ధ‌మ‌వుతుంది.

ఎందుకింత‌?

మ‌నిషై పుట్టిన వాడు కారాదు మ‌ట్టిబొమ్మ‌! అన్న సూక్తిని 1990లో టాటా ప‌గ్గాలు చేప‌ట్టిన ర‌త‌న్‌టాటా మ‌న‌సా వాచా న‌మ్మా రు. ఆయ‌న వ్యాపార‌వేత్త‌గానే కాదు.. మాన‌వ‌తా వేత్త‌గా కూడా ఎదిగారు. ఒక చేత్తో చేసిన దానం మ‌రో చేతికి తెలియ‌ద‌న్న నానుడికి ఆయ‌న నిద‌ర్శ‌నం. పంక్చ్యువాలిటీకి పెట్టింది పేరు. ఎక్క‌డా తేడా రాదు. లేదు.. అన్న‌ట్టుగానే ఆయ‌న జీవ‌న శైలి ఉండేది. ఉద్యోగుల‌ను క‌న్నబిడ్డ‌ల‌కంటే ఎక్కువ‌గా చూసుకున్నారు. పేద‌ల‌కు, స‌మాజానికిఏదైనా చేయాల‌న్న ప్ర‌ధాన ఆకాంక్ష ఆయ‌న‌ను అంద‌నంత అద్భుత తీరాల‌కు చేర్చింది. ప్ర‌తి విష‌యంలోనూ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు.

రూ.ల‌క్ష కారు!

మ‌ధ్య‌త‌ర‌గతి జీవుల ‘కారు’ క‌ల‌ల‌ను నెర‌వేర్చేందుకు ర‌త‌న్ టాటా చేసిన సాహ‌సోపేత నిర్ణ‌యం నానో కారు కేవ‌లం రూ.ల‌క్ష‌కే కారును అందించాల‌న్న బృహ‌త్ సంక‌ల్పంతో ర‌త‌న్ టాటా.. ఎన్నో అడ్డంకులు అధిగ‌మించారు. నిజానికి అప్ప‌టి మార్కెట్‌లో రూ.ల‌క్ష‌కు కారు దొర‌కడం మ‌హాక‌ష్టం. ఇదే విష‌యాన్ని దిగ్గ‌జ పారిశ్రామిక వేత్త‌లు కూడా చెప్పారు. అయినా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కోసం ఆమాత్రం చేయొచ్చ‌న్న ఏకైక సంక‌ల్పంతో ముందుకు న‌డిచారు. విజ‌య‌వంతంగా నానో కారు ను రిలీజ్ చేశారు. కానీ, కాలానికి ఈ కారు త‌ట్టుకోలేక పోయింది. ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. కానీ, పోటీ ప్ర‌పంచంలో నానో..’నానో’గా మిగిలిపోయింది.

సేవా త‌త్ప‌ర‌త‌!

ర‌త‌న్ టాటా అంటే.. వ్యాపార వేత్త‌గా పారిశ్రామిక వేత్త‌లు చూస్తారు. కానీ, రాజ‌కీయ నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఆయ‌న సేవాత‌త్ప‌రుడు. “మా నియోజ‌క‌వ‌ర్గంలో మీరు సాయం చేయాలి” అని అడ‌గ‌డ‌మే ఆల‌స్యం.. త‌న బృందాన్ని ర‌త‌న్ టాటా మోహ‌రిస్తారు. అక్క‌డ ఏం చేయాలో.. ఎవ‌రికి ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పించాలో కూడా.. ఆయ‌న అంచ‌నావేసుకుంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేల‌తోకూడా క‌లిసి చేసిన అనే అభివృద్ధి ప‌నులు వంద‌ల గ్రామాల‌కు తాగునీటిని, మౌలిక సౌక‌ర్యాల‌ను, విద్యుత్‌ను, విద్యాల‌యాల‌ను, క‌ళాశాల‌ల‌ను ఇలా ఎన్నింటినో టాటా అందించారు. `సుక‌వి జీవించు ప్ర‌జ‌ల నాల్క‌ల యందు“ అంటారు ప్ర‌ముఖ క‌వి జాషువా. అయితే.. ర‌త‌న్ టాటా సుక‌వి కాక‌పోవ‌చ్చు.. కానీ, సేవాత‌త్ప‌రుడు. అందుకే.. ఆయ‌న పేరు కూడా చిర‌స్థాయే!!