రషీద్ ఖాన్.. క్రికెట్ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అఫ్గానిస్థాన్ లాంటి దేశం నుంచి వచ్చి క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం, పెద్ద జట్లలో ఉండదగ్గ నైపుణ్యం సంపాదించడం, ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసరడం అంటే మామూలు విషయం. అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ విప్లవానికి కారణమైన క్రికెటర్లలో అతనొకడు.
ప్రత్యర్థి జట్లు సైతం ఎంతో ఇష్టపడే, గౌరవించే ఆటగాడతను. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ లెగ్ స్పిన్నర్లలో అతనొకడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ఆడే రషీద్.. ప్రతిసారీ తనదైన ప్రదర్శనతో లీగ్ హీరోల్లో ఒకడిగా నిలుస్తుంటాడు. ఈసారి టోర్నీ యూఏఈలో కావడంతో అతడిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఐతే తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను ఆ అంచనాల్ని అందుకోలేకపోయాడు. అందుకు తగ్గట్లే సన్‌రైజర్స్ ఆట కూడా తయారైంది. ఆ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
కానీ మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చక్కటి ప్రదర్శనతో దిల్లీపై విజయం సాధించింది. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన రషీద్.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సైతం గెలిచాడు. ఈ అవార్డును అందుకుంటూ ఉద్వేగానికి గురైన రషీద్.. గత ఏడాదిన్నర కాలంలో తన జీవితంలో జరిగిన రెండు పెద్ద విషాదాల గురించి చెప్పుకొచ్చాడు.
గత ఏడాది రషీద్ తండ్రి చనిపోగా.. మూడు నెలల కిందట అతడి తల్లి కూడా మరణించిందట. ఇప్పుడు రషీద్ వయసు 22 ఏళ్లే. ఇంత చిన్న కుర్రాడు ఈ వయసులో ఏడాది వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం అంటే అదెంత పెద్ద విషాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బాధ నుంచి కోలుకుని మళ్లీ క్రికెట్ ఆడటం చాలా కష్టమైందని అతను చెప్పాడు.
తన తల్లే తనకు అతి పెద్ద ఫ్యాన్ అని.. ఐపీఎల్లో తాను ఆడటం ఆమెకెంతో ఇష్టమని.. తాను ఈ లీగ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకుంటే ఆ రాత్రంతా దాని గురించి తనతో మాట్లాడుతూనే ఉండేదని.. ఇప్పుడు ఆమె లేకపోవడం తీవ్ర వేదన కలిగిస్తోందంటూ బహుమతి ప్రదానోత్సవంలో చెప్పడం అందరినీ కలచివేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates