రీల్ కాదు రియల్ ఉదంతమిది. గతంలో వెలుగు చూసి సంచలనంగా మారిన ఈ దారుణ నేరాలకు పాల్పడే జంటకు రంగారెడ్డి జిల్లా కోర్టులు తాజాగా జీవితఖైదు శిక్ష విధించింది.
ఒంటరి మహిళల్ని టార్గెట్ చేయటం.. వారిని అత్యాచారం చేసి.. ఆపై హత్య చేయటం..వారి వద్ద ఉన్న సొత్తును దొంగలించే దారుణ నేరానికి భార్య సహకారం అందించే వైనం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
అలాంటి దుర్మార్గ జంటకు తాజాగా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. మూడు వేర్వేరు కేసులకు సంబంధించి వేర్వేరు తీర్పుల్ని ప్రకటించింది. అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా జనగాం గ్రామానికి చెందిన కురువ స్వామి అలియాస్ రవి (30), నర్సమ్మలు భార్యభర్తలు. వీరు సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వైఎస్సార్ కాలనీలో స్థిరపడ్డారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించటానికి వీలుగా ఒంటరి మహిళల్ని టార్గెట్ చేయటం. వారికి మాయమాటలు చెప్పి దోపిడీ చేయటం.. అత్యాచారం చేసి చంపేయటం లాంటివి చేస్తుంటారు.
2021 జులై 25న మల్లంపేట (బాచుపల్లి సమీపంలోని) అడ్డాలో పని కోసం ఒక మహిళ (35) ఎదురు చూస్తోంది. కూలి పని ఉందని చెప్పి.. బైక్ మీద తీసుకెళ్లారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారుకు తీసుకెళ్లి ఆమె పై రేప్ చేసే ప్రయత్నం చేశాడు రవి. అందుకు ఆమె ఒప్పుకోలేదు.
దీంతో.. ఆమెను భార్య నర్సమ్మగా గట్టిగా బంధించింది. దీంతో.. రవి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాల్ని దోచుకొని ఆమెను క్రూరంగా హింసించి చంపేశారు. దీనికి సంబంధించిన కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
నిందితులను రిమాండ్ చేసి తరలించిన కోర్టు తాజాగా భార్య భర్తలు ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఇదే తరహాలో శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. మల్లంపేట పరిధిలో జరిగిన హత్యకు కేవలం వారం ముందే మరో మహిళను అత్యాచారం చేసి.. ఆమె ఆభరణాల్ని దోచుకొని తీవ్రంగా కొట్టారు.
సదరు బాధిత మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. చనిపోయిందని భావించిన వారు.. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం ఆమె కోలుకుంది. ఈ తరహాలో మరో దోపిడీకి పాల్పడ్డారు. ఈ మొత్తం ఉదంతాల్లో భర్త రవికి భార్య సహకారం అందించారు. మొత్తంగా ఈ మూడు కేసులకు వేర్వేరుగా శిక్షలు విధించారు.