భార‌త్‌ ‘ఉత్త‌మం’.. దిగ‌జారింది!!

ప్ర‌పంచ దేశాల్లో అత్యుత్త‌మంగా ఉన్న కంట్రీల‌కు సంబంధించి తాజాగా ఓ రిపోర్టు వ‌చ్చింది. యూఎస్ న్యూస్ అండ్ వ‌ర‌ల్డ్ రిపోర్టు .. తాజాగా 2024కు సంబంధించి ఉత్త‌మ దేశాల జాబితాను విడుద‌ల చేసింది. దీనిలో భార‌త్ గ‌త ఏడాదితో పోలిస్తే.. మూడు పాయింట్‌లు దిగ‌జారింది. 2023లో అత్యుత్త‌మ దేశాల జాబితాలో భార‌త్ 30వ స్థానంలో ఉంది. అయితే.. ఈ సారి మాత్రం 33వ స్థానానికి దిగ‌జారింది. దీనికి కార‌ణం ఏంటి? అనే విష‌యంలో నివేదిక కొన్ని విష‌యాలు వెల్ల‌డించింది.

భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ త‌గ్గిపోతుండ‌డం, మ‌ణిపూర్ అల్ల‌ర్లు, జ‌మ్ము క‌శ్మీర్ వివాదం, ఉమ్మ‌డి పౌర‌స్మృతి వంటి వివాదాస్ప‌ద అంశాల‌ను ప్ర‌స్తావించింది. దీంతో గ‌త ఏడాది ఉన్న 30వ ర్యాంకును భార‌త్ కోల్పోయింది. ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన ర్యాంకుల్లో భార‌త్ 33వ స్థానంతో స‌రిపెట్టుకుంది. ఇక‌, ఎప్ప‌టి లాగే.. ప‌ర్యాట‌కుల స్వ‌ర్గ ధామం.. స్విట్జ‌ర్లాండ్ 1వ ప్లేస్‌ను ద‌క్కించుకుంది. త‌ర్వాత స్థానాల్లో జ‌పాన్‌, అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. అలాగే తొలి 25 స్థానాల్లో చైనా ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తం 80 దేశాల‌కు సంబంధించి ఈ రిపోర్టు వ‌చ్చింది.

అయితే.. ఈ స‌ర్వే.. సంస్కృతి, వార‌స‌త్వం, భావ ప్ర‌క‌ట‌న‌, వివాద ర‌హితం అనే ప్ర‌ధానంగా నాలుగు అంశాల‌ను ప‌రిశీలిస్తుంది. వీటి ఆధారంగా వ‌చ్చే ప‌ర్యాట‌క రెవెన్యూ ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది. ఇక‌, పాకిస్థాన్‌కు ఈ జాబితాలో పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. మ‌రోవైపు స్విట్జ‌ర్లాండే వ‌రుస‌గా తొలి స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అమెరికాలో కాల్పులు, రాజ‌కీయంగా ఏర్ప‌డుతున్న వివాదాలు.. వంటివి అస్థిర‌త‌కు కార‌ణంగా ఈ స‌ర్వే పేర్కొంది. అయినా.. ఈ దేశం తొలి 5 స్థానాల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. భార‌త్ మాత్రం 33వ స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.