ఆయన జీతం ఏడాదికి 135 కోట్లు… ఇండియాలోనే !

దేశంలో అత్యధిక జీతం తీసుకునే కార్పొరేట్ ప్రముఖుడు ఎవరో తెలుసా? టాటా సన్స్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎన్. చంద్రశేఖరన్. ఆయనకు ఏడాదికి ఇచ్చే జీతం అక్షరాల రూ.135 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతం ఏకంగా 20 శాతం పెరిగింది.

దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్రాండ్ల వరుసలో ముందుంటుంది టాటా గ్రూపు. టాటా సంస్థకు చెందిన ఉత్పత్తి అన్నంతనే కళ్లు మూసుకొని కొనేసే పరిస్థితి. నిజానికి చంద్రశేఖరన్ కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత టాటా గ్రూప్ దూసుకెళుతున్న పరిస్థితి. ప్రస్తుతం దేశంలోని అన్నిటికంటే ఎక్కువ మార్కెట్ విలువ టాటా గ్రూప్ కే ఉంది. ఈ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ.30.37 లక్షల కోట్లుగా చెప్పాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ కేవలం రూ.20.71 లక్షల కోట్లే. ఏడాది వ్యవధిలో పెరిగింది 47 శాతంగా పెరగటం గమనార్హం.

అంతేకాదు.. నికర లాభం కూడా భారీగా ఆర్జించింది. ఈ ఏడాది రూ49 వేల కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తే.. గత ఏడాది కంటే ఇది 74 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. రూ.135 కోట్ల శాలరీలో రూ.121.5 కోట్లను కమిషన్ రూపంలో పొందటం గమనార్హం. 2016లో టాటా బోర్డులో చేరిన చంద్రశేఖరన్.. గత ఏడాది రూ113 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. ఇదే టాటా గ్రూపులో టాటా సన్స్ సీఎఫ్ వో సౌరభ్ అగర్వాల్ ఏడాదికి రూ.30 కోట్ల వేతనం అందుకుంటున్నారు.

చంద్రశేఖరన్ తర్వాత అత్యధిక వేతనం సౌరభ్ దే. టీసీఎస్.. టాటా స్టీల్.. తాజ్ హోటల్స్ చీఫ్ ల కంటే ఆయనదే ఎక్కువ జీతం. టీసీఎస్ సీఈవో క్రతి వాసన్ రూ.25 కోట్ల వేతనాన్ని అందుకుంటే.. ఐహెచ్ సీఎల్ హెడ్ పునీత్ చత్వాల్ జీతం రూ.19 కోట్లు. టాటా స్టీల్ చీఫ్ టీవీ నరేంద్రన్ ఏడాదికి రూ.17 కోట్ల వేతనాన్ని అందుకుంటున్నారు.

టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా.. టాటా కన్జ్యూమర్ ప్రొడక్టస్ నుంచి సునీల్ డిసౌజా.. టాటా కెమికల్స్ సీఈవో ఆర్. ముకుందన్ తదితరులు కూడా భారీ వేతనాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో విప్రో సీఈవోగా వ్యవహరించిన థియరీ డెలాపోర్టే రూ.167 కోట్ల వార్షిక వేతనాన్ని పొందినా.. అందులో కొన్ని ప్యాకేజీతో పాటు.. స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో.. జీతం పరంగా చూస్తే మాత్రం చంద్రశేఖరన్ ది అత్యధిక శాలరీగా చెప్పాలి.