టెక్సాస్ స్టేట్ రోడ్డు ప్రమాదంలో మనోళ్లు నలుగురు దుర్మరణం

నాలుగు నిండుప్రాణాల్ని తీసింది రోడ్డు యాక్సిడెంట్. ఉన్నత విద్య కోసం.. డాలర్ డ్రీమ్స్ ను తీర్చుకోవటానికి అమెరికాకు వెళ్లిన నలుగురు భారతీయులు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘనాథ్.. ఫరూఖ్.. లోకేశ్ లతో పాటు తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ నలుగురు కార్ పూలింగ్ ద్వారా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. బెన్ టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒక వాహనంలో బయలుదేరారు.

అనూహ్యంగా వరుసగా 5 వాహనాలు ఒకదానికి ఒకటి అతి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. డల్లాస్ లోని బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్, భార్యను కలిసేందుకు బయలుదేరిన లోకేశ్.. విశ్వవిద్యాలయానికి వెళ్తున్న దర్శిని వాసుదేవన్ లతో పాటు ఫరూఖ్ కూడా ఒకే కారులో ఎక్కారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకోవటంతో కారులో నుంచి బయటకు రాలేకపోయినట్లు చెబుతున్నారు.

వీరి డెడ్ బాడీస్ గుర్తు పట్టలేనంతగా కాలిపోవటంతో.. కార్ పూలింగ్ ద్వారా యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మరణించిన వారి వివరాలు ఆధారంగా వారిని గుర్తించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.