వైసీపీలో ఇది చాలదు.. ఇంకా పెంచాల్సిందే..!

ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచ‌నా? అంటే.. ఇంకా కొంచెం పెంచాల్సిందేన‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం సుప్త‌చేత‌నావ‌స్థలో వైసీపీని పుంజుకునేలా చేసేందుకు.. ఒక్క అడుగు అయితే ప‌డింది. పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. రెండు మాసాల‌కు వైసీపీలో మార్పులు చోటు చేసుకు న్నాయి. తాజాగా కొన్ని కీల‌క స్థానాల‌ను మార్పు చేస్తూ.. జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌లువురిని పార్టీ కీల‌క ప‌ద‌వుల్లోకి తీసుకున్నారు.

మ‌రికొంద‌రిని.. జిల్లాల స్థాయిలో అధ్య‌క్షులుగా తీసుకోగా.. ఇంకొంద‌రిని బీసీ, ఎస్సీ, యువ‌జ‌న‌, స్టూడెంట్ విభాగాల్లోకి తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వేంపల్లి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాకు ఛాన్స్ ఇచ్చారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల అనంత‌రం.. రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాము ప‌నులు చేయించ‌లేక పోయామ‌ని అందుకే ఓడిపోయామ‌న్నారు.

అలాంటి రాజాకు కీల‌క‌మైన ప‌ద‌వి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను నియమించారు. వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా సుధాకర్‌బాబు, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించారు. చిరంజీవి విష‌యంలో అనేక అనుమానాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఆయ‌న పార్టీలో ఉంటారా..? ఉండ‌రా? అనేది చ‌ర్చ‌. టికెట్ విష‌యంలో త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వాపోతున్న ఆయ‌న‌కు తాజాగా ప‌ద‌వి ఇచ్చి.. ప‌గ్గాలు వేసిన‌ట్టు అయింది.

వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా దూలం నాగేశ్వ రరావుకు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్‌ను జగన్ నియ‌మించారు. అయితే.. ఈ మార్పుల‌తో పార్టీలో సంతృప్తి గ్రాఫ్ పెర‌గ‌బోద‌ని అంటున్నారు నాయ‌కులు. మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు చేయాల్సిన‌, తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అప్పుడు మాత్ర‌మే మార్పు సాధ్య‌మ‌ని అంటున్నారు.