సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం.. సొంతంగా పార్టీ పెట్టడం అత్యధిక స్థాయిలో జరిగే రాష్ట్రం తమిళనాడే. మన కంటే కూడా అక్కడ రాజకీయాల్లో సినీ స్టార్ల ఆధిపత్యం ఎక్కువ. సినీ రంగం నుంచి వచ్చిన కరుణానిధి, జయలలితలే అక్కడ సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజకీయాలను శాసించారు. వీరి బాటలో విజయ్ కాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లు సైతం రాజకీయాల్లోకి వచ్చారు కానీ.. అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేదు. విజయ్ కాంత్ కొన్నేళ్లయినా ప్రభావం చూపాడు కానీ.. కమల్ పూర్తిగా తేలిపోయాడు.
ఇక రజినీకాంత్ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించాడు. ఐతే ఇప్పుడు తమిళంలో నంబర్ వన్ స్టార్‌గా ఎదిగిన విజయ్ రాజకీయారంగేట్రం చేయబోతున్నాడు. ఆల్రెడీ ‘తమిళ వెట్రి కళగం’ అనే పేరుతో విజయ్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
పార్టీని ప్రకటించాక హడావుడి పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు విజయ్. ఈ క్రమంలోనే విజయ్ తాజాగా తన పార్టీ జెండాను, అలాగే జెండా గీతాన్ని ఆవిష్కరించారు. పసుపు, ముదురు ఎరుపు రంగులతో ఉన్న ఈ జెండాలో రెండు ఏనుగులతో పాటు.. నక్షత్రాల మధ్య నెమలి ఉండేలా డిజైన్ చేశారు. ఐతే ఈ జెండాలో అందరి దృష్టినీ ఆకర్షించింది ప్రధానంగా ఆ రెండు ఏనుగులే.
ఒకప్పుడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తన పార్టీ కోసం ఏనుగు సింబల్‌ను ఎంచుకున్నారు. అందుకు అప్పట్లో ఆయనో సూత్రీకరణ కూడా చెప్పారు. ఇప్పుడు తన పార్టీ జెండాలో ఏనుగులను పెట్టడం ద్వారా తాను అంబేదర్కర్ అడుగు జాడల్లో నడవబోతున్నట్లు విజయ్ చెప్పకనే చెప్పారు. క్రిస్టియన్ అయిన విజయ్‌కి దళితుల్లో విశేషమైన ఆదరణ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
తన పార్టీ జెండాను ఇలా రూపొందించడం ద్వారా వెనుకబడిన వర్గాలను తన వైపు తిప్పుకునేలా విజయ్ ప్లాన్ చేశారని భావిస్తున్నారు. కానీ దీని వల్ల ఆయన మీద ఒక ముద్ర పడిపోయి అందరివాడు కాకుండా పోతాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.