ఈ దేశంలో గవర్నమెంటు ఆఫీసుల్లో స్వీపర్ కూడా అవినీతి చేయగలడు అని నిరూపించడానికి ఉత్తరప్రదేశ్ లో ఒక స్వీపర్ భాగోతం బయటకు వచ్చింది. అతగాడికి 9 లగ్జరీకార్లు ఉండటాన్ని అధికారులు సైతం అవాక్కు అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే..తానేమీ తప్పు చేయలేదన్నట్లుగా సదరు స్వీపర్ చెప్పే మాటల్ని వింటే నోటి వెంట మాట రాని పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు కోట్లకు పడగలెత్తిన వైనం సంచలనంగా మారింది. ఏదో లాటరీ తగలటమో.. ఎప్పుడో కొన్న భూమికి అదిరే రేటు రావటం మరో ఎత్తు. తాజా ఎపిసోడ్ మాత్రం కాస్త భిన్నమైంది. సంతోష్ జైస్వాల్ అనే వ్యక్తి గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కథ మొదలైంది ఎప్పుడంటే.. అతగాడికి నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రమోషన్ వచ్చింది.
అంతే.. అక్కడకు వెళ్లిన అతడు ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేయటం.. భారీగా నొక్కేస్తూ.. అడ్డగోలుగా సంపాదించాడు. తాజాగా అతడి భాగోతం బయటకు వచ్చి అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేసి.. కేసు పెట్టారు. ఇక.. అధికారులు అతడ్ని విచారించి.. సోదాలు నిర్వహించే వేళలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అతడికి మొత్తం తొమ్మిది లగ్జరీకార్లు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు.
కాకుంటే.. ఆ కార్లు నిందితుడి సోదరుడు.. భార్య పేర్ల మీద ఉండటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన లగ్జరీకార్ల భాగోతం అనంతరం అతడి బ్యాంకు ఖాతాల మీద ఫోకస్ పెంచారు. రానున్న రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించి మరెన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయో?
Gulte Telugu Telugu Political and Movie News Updates