భరతనాట్యం, కూచిపూడి రంగాలలో ఖ్యాతి గడించిన నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్ను మూశారు. ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా వేలాది ప్రదర్శనలతో ఖ్యాతి గడించిన యామినీ కృష్ణమూర్తి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యామినీ కృష్ణమూర్తి శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు నృత్యకారులు, నర్తకులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
1940లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జన్మించిన యామినీ కృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి కూచిపూడి, భరతనాట్యం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి సుప్రసిద్ధ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే 1968లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించింది. యామినీ కృష్ణమూర్తి నాట్య రంగంలో సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కూడా యామినీ కృష్ణమూర్తి గతంలో సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ స్థాపించి నృత్యరంగంలో వేలాది మందికి శిక్షణనిచ్చారు. ప్యాషన్ ఫర్ డాన్స్ పేరుతో ఆమె రాసిన పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో యామినీ కృష్ణమూర్తి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. యామినీ కృష్ణమూర్తి ఇకలేరు అన్న వార్తతో ఆమె అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తున్నారు.