రోజూ ఒక్కసారైనా నవ్వాలి.. ఆ దేశంలో తాజా చట్టం

నవ్వడం ఒక యోగంగా అప్పుడెప్పుడో మన పెద్దలు చెప్పేశారు. ఇప్పుడీ విషయాన్ని రూల్ రూపంలోకి తీసుకొచ్చిన ఒక దేశం తీరు ఆసక్తికరంగా మారింది. రోజు మొత్తంలో ఒక్కసారైనా కచ్ఛితంగా నవ్వాలన్న చట్టాన్ని తీసుకొచ్చిన వైనం చూస్తే.. అంత యంత్రాల మాదిరి బతికే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారా? ఇంతకూ ఆ దేశం ఏంటి? ఆ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? దాని నేపథ్యం ఏంటి? లాంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

ఈ కొత్త చట్టాన్నిజపాన్ దేశంలోని ఒక రాష్ట్రం (యమగట) తాజాగా తీసుకొచ్చింది. ప్రతి రోజు అందరూ నవ్వాలని.. కనీసం రోజులో ఒక్కసారైనా నవ్వటాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. శారీరక.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాలన్న సదుద్దేశ్యంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొంది. తాజాగా ఈ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నవ్వుతో కూడిన వాతావరణం పని ప్రదేశంలో ఉండేలా ప్రోత్సహించాలంటూ కంపెనీలను ఆదేశించిన ఈ చట్టంలో మరిన్ని అంశాన్ని ఉన్నాయి. ప్రతి నెల ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని పేర్కొన్న ఈ చట్టం.. జపాన్ లోని ‘‘యమగట విశ్వవిద్యాలయం’’లోని ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల ఫలితంగా చట్టంగా తీసుకొచ్చారు. మెరుగైన ఆరోగ్యం.. జీవనకాలం పెంపునకు ఏయే అంశాలు తోడ్పాటును అందిస్తాయన్న అంశంపై రీసెర్చ్ చేయగా.. తక్కువగా నవ్వే వాళ్లలో కొన్ని రకాల వ్యాధుల వల్ల మరణ ముప్పు పెరుగుతుందని గుర్తించారు.

ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే.. ఈ చట్టాన్ని కొందరు రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు నవ్వలేకపోవచ్చని.. ఈ చట్టం వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాదిస్తున్నారు. ఈ వాదనపై యమగట రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ప్రతిరోజూ నవ్వాలని తాము బలవంతం చేయట్లేదని.. ప్రజల ఇష్టానికే వదిలేస్తున్నామని.. ఈ కారణంతోనే నవ్వని వారిపై ఎలాంటి ఫైన్ వేయట్లేదని పేర్కొన్నారు. ఏమైనా.. ప్రజలు నవ్వితే ఆరోగ్యంగా బతుకుతారన్న అంశంపై అధ్యయనం చేసి.. దాన్ని చట్టంగా మార్చే వరకు వెళ్లటాన్ని చూస్తే.. తమ ప్రజల సంక్షేమాన్ని అక్కడి ప్రభుత్వాలు ఎంత లోతుగా చూస్తున్నాయన్న భావన కలుగక మానదు. అదే టైంలో రోజులో ఒక్కసారి కూడా నవ్వని జనాల మధ్య మనం లేకపోయామన్న పెద్ద రిలీఫ్ ఒక్కసారి రావొచ్చని చెప్పాలి.