వైసీపీని హ‌డ‌లెత్తించిన‌.. ‘వేణు స్వామి!’

సెల‌బ్రిటీల జాత‌కాలు చెప్పే వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హైటెక్ స్వామిగా పేరొందారు. సినీ తార‌లు, క్రికెట‌ర్ల‌కు ఆయ‌న జోస్యాలు చెబుతుంటారు. జాత‌కాలు కూడా చెబుతుంటారు. ప్ర‌త్యేకంగా పూజ‌లు కూడా చేస్తుంటారు.

ఇటీవ‌ల నెల రోజుల కింద‌ట ఓ సినీ తార జాత‌కంలో దోషం పోవాల‌ని ఆకాంక్షిస్తూ… మ‌ద్యంతో ప్ర‌త్యేక హోమం చేయించిన విష‌యం తెలిసిందే. ఇది తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కూడా దారి తీసింది. ఆ త‌ర్వాత‌.. కూడా ఆయ‌న అనేక మంది జాత‌కాల‌తో.. ఫేమ‌స్ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే ఏపీ ఎన్నిక‌ల‌కు ముందు.. వేణు స్వామి.. పెద్ద సంచ‌ల‌నం అయ్యారు. “నేను చెప్తున్న క‌దా.. ఏపీలో మ‌ళ్లీ జ‌గ‌న్ గారే ముఖ్య‌మంత్రి అవుత‌రు. రాసిపెట్టుకో” అంటూ త‌న తెలంగాణ యాస‌లో ఆయ‌న యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల‌ను ఇర‌గ‌దీశారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ జాత‌కాన్ని కూడా ఆయ‌న వివ‌రించారు. జ‌గ‌న్‌కు ఉన్న దోషం పోయింద‌ని.. ఇప్పుడు ఆయ‌న గ్ర‌హాల‌న్నీ ఉచ్ఛ స్థితిలో కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. అందుకే.. రాజ‌యోగం.. కొన‌సాగుతుంద‌ని అన్నారు. మొత్తంగా వేణు స్వామి చెప్పిన ఈ వీడియోను వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున వైర‌ల్ చేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే వైసీపీ నాయ‌కులను వేణు స్వామి హ‌డ‌లెత్తిస్తున్నారు. దీనికి కార‌ణం.. తాజాగా ఆయ‌న చెప్పిన జాతకం.. జోస్యం వంటివి ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో ఇప్పుడు వేణు స్వామి పేరు ఎత్తేందుకు కూడా.. వైసీపీ నాయ‌కులు హ‌డ‌లి పోతున్నారు.

తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు మ‌ధ్య పోరు జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీనికి ముందు వేణు స్వామి మాట్లాడుతూ… ప‌క్కాగా హైద‌రాబాద్ గెలిచి తీరుతుంద‌ని.. రాసిపెట్టుకోవాల‌ని .. స‌వాల్ రువ్వారు.

కానీ, చివ‌ర‌కు ఐపీఎల్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు దీనిని టీడీపీ నేత‌లు.. ట్రోల్ చేస్తున్నారు. రేపు వైసీపీ ప‌రిస్థితి కూడా ఇంతే అంటూ కామెంట్లు చేస్తూ.. పైన వేణు స్వామి చెప్పింది పోస్టు చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయ‌కుల‌కు నోట మాట రావ‌డం లేదు. మ‌రి వేణు స్వామి చెప్పింది.. ఏపీ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.