టీడీపీ ప్ర‌భుత్వంలో ఈ ప‌ద‌వులు రిజ‌ర్వ్‌!

ప్ర‌స్తుతం ముగిసిన ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడ‌తారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌య‌మే. ఎవ‌రికి వారు వారి వారి లెక్క‌లు వేసుకున్నారు. 151కిపైగా స్థానాల‌తో గెలుస్తామ‌ని వైసీపీ చెప్పింది. ఇక‌, 160 స్థానాలు మావేన‌ని టీడీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా.. అనే విష‌యాలు మాత్రం జూన్ 4వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. అయితే.. ఈలోగా టీడీపీ కూట‌మి క‌నుక గెలిస్తే.. ఎవ‌రెవ‌రికి ఏయే ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే విష‌యంలో ఆస‌క్తి నెల‌కొంది.

ఈ విషయంలో కొంద‌రు నాయ‌కుల‌కు కొన్ని ప‌ద‌వులు రిజ‌ర్వ్ అయిపోయాయ‌ని.. వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు. ఆర్థిక శాఖ‌ను మ‌రోసారి సీనియ‌ర్ నాయ‌కుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికే అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న రెండు సార్లు అస‌లు పోటీ చేయ‌క‌పోయినా.. 2014లో మాత్రం చంద్ర‌బాబు పిలిచి పిల్ల‌నిచ్చిన‌ట్టు ఆయ‌న‌కే ఆర్థిక శాఖ‌ను అప్ప‌గించారు. ఎమ్మెల్సీని చేసి మ‌రీ ఈ ప‌ద‌విని అప్ప‌గించారు. ఆర్థిక శాఖ‌పై ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు.. గ‌తంలో ఉన్న అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు ఈ త‌ర‌హా కేటాయింపు చేశారు. ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ఇక‌, మ‌రో కీల‌క పోస్టు.. రాష్ట్ర హోం శాఖ‌. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఎలా ఆలోచ‌న చేస్తార‌నే విష‌యం ఎలా ఉన్నా.. ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు మాత్రం ఈ ప‌ద‌విని త‌మ‌కంటే త‌మ‌కేన‌ని చెబుతున్నారు. బ‌హిరంగ వ్యాఖ్యలు చేయ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం వారు తాము హోం మంత్రి అవుతామ‌ని అంటున్నారు. వీరిలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చ‌న్నాయుడి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గ‌తంలో ఈయ‌న‌ను ఈఎస్ ఐ కుంభ‌కోణంలో అరెస్టు చేసిన‌ప్పుడు.. మీడియా ముందు కూడా ఇదే మాట చెప్పారు. త‌ర్వాత మ‌హానాడులోనూ ఇదే ప్ర‌క‌ట‌న చేశారు.

చంద్ర‌బాబును అడిగైనా స‌రే.. హోం మంత్రి అయ్యి.. వైసీపీ నేత‌ల భ‌ర‌తం ప‌డ‌తాన‌ని చెప్పారు. దీంతో ఇప్పుడు పార్టీఅధికారంలో కి వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలియ‌డంతో అచ్చెన్నా ఈ శాఖ‌పైనే చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇదేస‌మ‌యంలో పార్టీలో కొత్త‌గా చేసిన‌.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కూడా.. హోం మంత్రి రేసులో ఉన్నార‌ని చ‌ర్చ సాగుతోంది. ఈయ‌న ను వైసీపీ హ‌యాంలో పోలీసులు నిర్బంధించి లాఠీ చార్జి చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో తాను హోం మంత్రి బాధ్య‌త‌లు తీసుకుని.. త‌ప్ప‌కుండా క‌సి తీర్చుకుంటాన‌ని అంటున్నారు., దీంతో ఈ రెండు ప‌ద‌వులు.. అంటే ఆర్థికం.. హోం శాఖ‌లు.. రిజ‌ర్వ్ అయ్యాయ‌నిత‌మ్ముళ్లు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.