బెంగ‌ళూరులో ‘రేవ్ పార్టీ’.. వైసీపీ మంత్రి వాహ‌నం గుర్తింపు

క‌ర్ణాటక రాజ‌ధాని బెంగ‌ళూరులో సంచ‌ల‌నం తెర‌మీదికి వ‌చ్చింది. ఆదివారం అర్ధ‌రాత్రి ఇక్క‌డి ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్టు తెలిసింది. దీనిని స్థానిక సీసీబీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. ఈ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ‌లోని న‌టి.. హేమ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే.. ఆమె దీనిని ఖండించారు. త‌నకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌న్నారు. త‌న‌నుఅన‌వ‌స‌రంగా ఈ రొచ్చులోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

అంతేకాదు.. తాను ఆదివారం హైద‌రాబాద్‌లోనే ఉన్నాన‌ని.. కుటుంబంతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాన‌ని హేమ వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను త‌న అభిమానులు ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాదు.. సోష‌ల్ మీడియా కూడా.. నియంత్ర‌ణ పాటించాల‌న్నారు. ఇక‌, ఈ పార్టీలో మ‌రో కీల‌క అంశం.. వైసీపీ మంత్రి కారు ప‌ట్ట‌బ‌డడం. వైసీపీ కీల‌క నాయ‌కుడు, స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే , రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్టిక్క‌ర్‌తో ఉన్న కారును రేవ్‌పార్టీని క‌ట్ట‌డి చేసేందుకు వ‌చ్చిన పోలీసులు గుర్తించారు.

ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ప‌లువురు తార‌లు, ప్ర‌ముఖుల కార్ల‌ను కూడా.. పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. రేవ్‌పార్టీలో డ్ర‌గ్స్ వినియోగించిన‌ట్టు గుర్తించారు. ఆదిశగానే ఇప్పుడు విచార‌ణ చేప‌ట్టారు. ఇక‌, ఒక ప్ర‌ముఖ వ్య‌క్తి పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఉన్న జీఆర్ ఫామ్ హౌస్‌లో ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు. దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ చేస్తున్న తెలిపారు. కాగా.. ఈ పార్టీకి వ‌చ్చిన వారు.. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా ఉన్న‌ట్టు గుర్తించారు.