ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి కరోనా మీదే ఉంది. అందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. నెలన్నరగా కరోనా తప్ప మరో చర్చ లేదు దేశంలో. ఇండియాలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు తలెత్తుతాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవస్థలన్నీ ఆ మహమ్మారిని నిలువరించే పనిలోనే నిమగ్నమయ్యాయి.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సైన్యంలో కొంతమందికి విశ్రాంతినిచ్చారు. కొంతమంది కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలకు వెళ్లారు. ఇలాంటి సమయంలో ఇండియాపై దాడి చేయడం తేలికని ఉగ్రవాదులు భావిస్తున్నారని.. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని.. ఇంటలిజెన్స్ వర్గాలు ప్రమాద హెచ్చరికలు జారీ చేశాయి.
సుమారు 300 మంది ఉగ్రవాదులు పీఓకే నియంత్రణ రేఖ వెంబడి కాపుగాసి ఉన్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందింది. అక్కడి నుంచి కశ్మీర్ లోయలోకి ప్రవేశించాలన్నది వారి కుట్రగా తెలుస్తోంది. రంజాన్ వేళ ఇండియాలోకి చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ముష్కరులు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం..సరిహద్దుల వెంబడి సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తోంది.
ఉగ్రవాదులకు కరోనా ఉండే ఆస్కారముందని, ఆ వైరస్ను అంటించే ప్రయత్నం కూడా చేయొచ్చని.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు. గత నెల కూడా నియంత్రణ రేఖ నుంచి దేశంలోకి దూసుకొచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా.. తొమ్మిది మందిని భద్రతా బలగాలు హతమార్చాయి.