ఈశ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ పరిచయం లేని వారు లేరు. సింపుల్‌గా ఉంటూ.. హోమాలు, యజ్ఞాలకు దూరంగా ఉంటూ.. తనదైన శైలిలో ఆధ్యాత్మికతను సైన్స్‌కు జోడిస్తూ ఆయన ప్రచారం చేయడం, శిబిరాలు నిర్వహించడం తెలిసిందే.
ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు.. ఆయన తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న తన ఆశ్రమంలో పెద్ద పండుగే చేస్తారు. దీనికి కేంద్ర మంత్రుల నుంచి ప్రముఖుల వరకు, ప్రపంచ దేశాల నుంచి అనేక మంది హాజరవుతారు. అయితే.. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఏం జరిగింది?
జగ్గీవాసుదేవ్(జగన్‌మోహన్) కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో అపోలో ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. గత నాలుగు వారాలుగా, సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, మహాశివరాత్రితో సహా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ పరీక్షలు చేయగా మెదడులో భారీ రక్తస్రావం కనిపించిందని పేర్కొన్నారు. మూడు రోజుల కిందట సద్గురును ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.
ఆయన మెదడులో ప్రాణాంతక వాపును గుర్తించినట్లు డాక్టర్ తెలిపారు. దీంతో అత్యవసర శస్త్రచికిత్స చేశామని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన బాగా కోలుకుంటున్నట్లు చెప్పారు. మేం చేయగలిగింది చేశాం. కానీ మీ మనోధైర్యంతో మీకు మీరే నయం చేసుకుంటున్నారని ఆయనతో సరదాగా అన్నాం అని డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. సద్గురు మేం ఊహించినదాని కంటే వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates