ఆన్‌లైన్ కోర్సులతో విద్యార్థులను ఆకట్టుకున్న బైజూస్
సంస్థ.. మూసేసేందుకు రెడీ అయిందా? ఇక, బైబై చెప్పడం ఒక్కటే మిగిలి ఉందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థకు మూలిగేనక్కపై తాడిపండు పడిన చందంగా ఈ సంస్థలో భారీ పెట్టుబడి పెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ సంస్థ తన మొత్తం పెట్టుబడిని 98 శాతం వెనక్కి తీసేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఇక, బైజూస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
ఏం జరిగింది?
కరోనా సమయంలో ఇంటికే పరిమితమైన విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా విద్యను చేరువ చేయడంలో ప్రత్యేకతను చాటుకున్న బైజూస్.. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. పలు రాష్ట్ర ప్రభుత్వా లు కూడా ఈ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే.. నిర్వహణ వ్యయం.. తర్వాత పాఠశాల విద్యకే విద్యార్థులు పరిమితం కావడంతో బైజూస్ సంస్థ నష్టాల బాట పట్టింది. ఇక, బైజూస్ కంటెంట్‌పైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీ మినహా .. ఇతర ప్రభుత్వాలు బైజూస్‌తో ఒప్పందాలు నిలిపివేశాయి.
ఈ పరిణామంతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న బైజూస్‌కు పెట్టుబడిదారులతో ఒప్పందం వివాదంగా మారింది. దీంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టంగా మారి బెంగళూరు, ఢిల్లీల్లోని తన విల్లాలను కూడా బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బేరం పెట్టారు. దీని ద్వారా వచ్చిన అడ్వాన్సు సొమ్మును ఉద్యోగులకు వేతనాల కింద చెల్లించారు. మరోవైపు పన్ను ఎగవేతల ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు చేశారు. అంతేకాదు.. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.
సాధారణంగా ఒక సంస్థ యజమానిపై లుక్ అవుట్ నోటీసులు వస్తే.. వెంటనే అది పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. ఇలానే ఆస్ట్రేలియాకు చెందిన భారీ పెట్టుబడిదారు గ్లోబల్ సంస్థ మాక్వారిక్ క్యాపిటల్.. తన పెట్టుబడిలో కేవలం 2 శాతం మాత్రమే కొనసాగిస్తామని, మిగిలిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో సంస్థ పూర్తిగా బేజారెత్తింది. స్విస్ బ్యాంక్ జూలియస్ బేర్ గ్రూప్ లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో బైజూస్‌లో పెట్టుబడిని తగ్గించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక, బైజూస్‌కు తాళం పడడం ఖాయమని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.