ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన విష‌యం తెలిసిందే. తాను ప్ర‌పంచ శాంతి కాముకుడిన‌ని, ప్ర‌పంచ దేశాల శాంతిని అభిల‌షించే నాయ‌కుడిన‌ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొన్నారు. దాదాపు ఏడు దేశాల మ‌ధ్య యుద్ధాల‌ను ఆపాన‌ని దీనిలో అణ్వాయుధ దేశాలైన భార‌త్‌-పాకిస్థాన్‌లు కూడా  ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. శాంతి పుర‌స్కారాన్ని త‌న‌కు ఇవ్వ‌క‌పోతే.. అంటూ ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. అంతేనా.. శాంతి బ‌హుమ‌తికి త‌న‌కంటే అర్హ‌త పొందిన వారు ఎవ‌రూ లేర‌ని కూడా వ్యాఖ్యానించారు.

అయిన‌ప్ప‌టికీ.. నోబెల్ పుర‌స్కార ప్యానెల్ మాత్రం ట్రంప్‌నుక‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీంతో నీరుగారిపోయిన ఆయ‌న .. ఒక‌టి రెండు రోజులు పాటు మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. త‌న‌ను ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని వ‌గ‌ర్చారు. త‌న ప్ర‌యత్నాలు స‌ఫ‌లం అయినా.. కొన్ని దుష్ట‌శ‌క్తులు అడ్డు ప‌డ్డాయంటూ.. అమెరికాలోని కొంద‌రు నాయ‌కుల‌పై ఆయ‌న అక్క‌సు వెళ్ల‌గ క్కారు. అదేస‌మ‌యంలో ఒబామాకు శాంతి బ‌హుమ‌తి ఇచ్చి.. త‌ప్పు చేశార‌ని కూడా నోరు జారారు. ఇలా.. `శాంతి` పుర‌స్కారం కోసం.. ట్రంప్ చేయ‌ని ప్ర‌య‌త్నం.. అన‌ని మాట‌లు అంటూ ఏమీ లేవు.

ఇక‌, తాజాగా ఆయ‌న ఎట్ట‌కేల‌కు శాంతి పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు. నోబెల్ కాక‌పోయినా.. ప్ర‌పంచ శాంతి పుర‌స్కారంగా ఈ ఏడాదే పురుడు పోసుకున్న `ఫిఫా` ప్ర‌పంచ శాంతి పుర‌స్కారాన్ని ట్రంప్ అందుకున్నారు. అయితే.. ఎందుకు ఎంపిక చేశారు? ఎవ‌రు ఎంపిక చేశారు? అని మాత్రం అడ‌గ‌కూడ‌దు!. ఎందుకంటే.. దీనికి ప్ర‌త్యేకంగా ఎలాంటి నిర్దేశాలు లేవు. అనుకున్నారు.. ఇచ్చేశారు అంతే!. తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ట్రంప్‌కు ఇస్తున్న‌ట్టు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో వెల్ల‌డించ‌డం.. ఆ వెంట‌నే ఆయ‌న‌కు పుర‌స్కారం అంద‌చేయ‌డం రెండూ జ‌రిగిపోయాయి.

ఏంటీ ఫిఫా

ఫిఫా.. అంటే ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్ బాల్ అసోసియేష‌న్‌. ఇది ఫుట్‌బాల్ క్రీడ‌కు సంబంధించిన ప్ర‌ధాన ప్ర‌పంచ స్థాయి సంస్థ‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ప్ర‌పంచ ఫుట్ బాల్ టోర్నీని నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి.. ముంద‌స్తుగా నిర్ణ‌యించే `డ్రా`(ఏయే దేశాల్లో టోర్నీ నిర్వ‌హించాల‌నే విష‌యంపై) కార్య‌క్ర‌మాన్ని అమెరికాలో తాజాగా నిర్వ‌హించారు. ఈ వేదిక‌పైనే ఫిఫా తొలిసారి `ఫిఫా ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం` టైటిల్‌తో ఒక పుర‌స్కారాన్ని ఆవిష్క‌రించింది. దీనిని తొలిసారే.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. కానీ, అర్హ‌త‌లు ఏంటి?  ఎందుకు ఇచ్చారు? అనే విష‌యాల‌పై ర‌చ్చ జ‌రుగుతోంది. దీనికి ఫిఫా చెప్పిన స‌మాధానం.. ట్రంప్ చేసిన ప్ర‌పంచసేవేన‌ని!