ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు తలొగ్గో గానీ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంచలన నిర్ణయం తీసుకుంది. పైలట్ల రెస్ట్ విషయంలో మొన్ననే పెట్టిన కొత్త రూల్స్‌ని వెనక్కి తీసుకుంది. “పైలట్ల వీక్లీ రెస్ట్ లో ఇతర సెలవులను కలపకూడదు” అనే నిబంధనను తక్షణమే రద్దు చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

అసలు గొడవ ఏంటంటే.. పైలట్ల ఒత్తిడి తగ్గించడానికి, విమాన ప్రయాణాల భద్రత పెంచడానికి డీజీసీఏ కఠినమైన నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం పైలట్లకు వారానికి కచ్చితంగా 48 గంటల రెస్ట్ ఉండాలి. పైగా వాళ్లు తీసుకునే సాధారణ లీవులను ఈ రెస్ట్‌ కింద లెక్కించకూడదు. కానీ, ఈ రూల్ వల్ల ఇండిగో దగ్గర ఉన్న పైలట్లు సరిపోలేదు. దీంతో షెడ్యూల్ మొత్తం గందరగోళం అయిపోయి, రోజుకు 500లకు పైగా విమానాలు రద్దయ్యాయి.

పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇండిగో యాజమాన్యం డీజీసీఏ కాళ్ల బేరానికి వచ్చింది. “మా వల్ల కావట్లేదు, ఫిబ్రవరి వరకు టైమ్ ఇవ్వండి” అని వేడుకుంది. దీంతో డీజీసీఏ తాత్కాలికంగా ఆ రూల్‌ని పక్కన పెట్టింది. దీనివల్ల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఊరట లభించింది. ఇకపై పైలట్ల లీవులను కూడా వీక్లీ రెస్ట్‌తో అడ్జస్ట్ చేసుకుని, వారిని ఎక్కువ డ్యూటీలకు వాడుకునే వెసులుబాటు దొరికింది. అంటే, మళ్ళీ పాత పద్ధతిలోనే రోస్టర్ నడుస్తుందన్నమాట.

అయితే, ఇండిగో ప్లానింగ్ లోపం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టమైంది. కొత్త రూల్స్ వస్తున్నాయని రెండేళ్ల ముందే తెలిసినా, కొత్త పైలట్లను తీసుకోకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నిబంధనలనే మార్పించుకుంది. దీనిపై పైలట్ల సంఘాలు మండిపడుతున్నాయి. “ఇది ప్రయాణికుల భద్రతతో చెలగాటం ఆడటమే. ఒక సంస్థ కోసం సేఫ్టీ రూల్స్‌ని మారుస్తారా?” అని ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా, డీజీసీఏ తీసుకున్న ఈ ‘యూ టర్న్’ వల్ల విమానాల రద్దు తగ్గే అవకాశం ఉంది.