టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో గెలిచే మ్యాచ్ చేజారింది. ఈ ఘోర పరాభవంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లపై గట్టిగానే విరుచుకుపడ్డారు. అసలు మహ్మద్ షమీ లాంటి సీనియర్ బౌలర్ ఎక్కడ? అతన్ని ఎందుకు పక్కన పెట్టారు? అంటూ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్‌లను సూటిగా ప్రశ్నించారు.

షమీ ఫామ్ లేక పక్కన పెట్టారా అంటే అదీ లేదు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ నిప్పులు చెరుగుతున్నాడు. కేవలం 5 మ్యాచ్‌లలోనే 9 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. మొన్నటి మ్యాచ్‌లో అయితే ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇంత బాగా ఆడుతున్న వెటరన్ పేసర్‌ను వదిలేసి, అనుభవం లేని బౌలర్లతో ప్రయోగాలు చేయడం ఏంటని భజ్జీ మండిపడ్డారు. మంచి బౌలర్లను కావాలనే పక్కన పెడుతున్నారని ఆరోపించారు.

ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్లు ఉన్నా, వాళ్లు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని హర్భజన్ అభిప్రాయపడ్డారు. షమీ లాంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉంటే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుందని అన్నారు. బుమ్రా ఉంటే మన బౌలింగ్ ఎటాక్ ఒకలా ఉంటుంది, అతను లేకపోతే పూర్తిగా తేలిపోతోందని విశ్లేషించారు. బుమ్రా లేనప్పుడు కూడా మ్యాచ్‌లు గెలవడం మనం నేర్చుకోవాలని, లేదంటే ఇలాంటి భారీ స్కోర్లు కూడా సేఫ్ కాదని హెచ్చరించారు.

కేవలం పేసర్లే కాదు, స్పిన్ విభాగంలో కూడా మనకు మ్యాచ్ విన్నర్లు లేరని భజ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ల సంగతేంటి? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరును ప్రస్తావించారు. టీ20లలో అద్భుతంగా రాణిస్తున్న వరుణ్‌ను వన్డేల్లోకి కూడా తీసుకురావాలని సూచించారు. వికెట్లు తీసే బౌలర్లు లేకపోతే వైట్ బాల్ క్రికెట్‌లో గెలవడం కష్టమని తేల్చి చెప్పారు.

ఇంగ్లాండ్‌లో బుమ్రా లేనప్పుడు సిరాజ్ అద్భుతంగా రాణించాడని, కానీ ఇప్పుడు అలాంటి ప్రదర్శనలు కరువయ్యాయని గుర్తు చేశారు. సౌతాఫ్రికాతో సిరీస్ 1-1తో సమం అయిన వేళ, చివరి మ్యాచ్‌కైనా సరైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. 350 కొట్టినా కాపాడుకోలేకపోతున్నామంటే అది కచ్చితంగా మేనేజ్‌మెంట్ వైఫల్యమే అని, ఇప్పటికైనా షమీ లాంటి సీనియర్ల విలువ గుర్తించాలని హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.