క్రికెట్‌లో ఏపీ నేత జోక్యం.. ఇక ఏపీకి ఆడ‌ను:

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయం కొన్ని రంగాల‌కే ప‌రిమిత‌మైంది. అయితే.. తాజాగా క్రికెట్‌లోనూ ఏపీ నేత‌ల జోక్యం పెరిగిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం స్టార్ క్రికెట్ హ‌నుమ విహారీ చేసిన వ్యాఖ్య‌లు క్రికెట్‌తోపాటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఏపీ నేతల పాత్ర పెరిగిపోయింద‌ని హ‌నుమ విహారీ వ్యాఖ్యానించాడు. ఏపీకి చెందిన ఓ రాజ‌కీయ నేత(విజ‌య‌సాయిరెడ్డి అనే ప్ర‌చారం ఉంది) జోక్యం కార‌ణంగా తాను తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని ఆయ‌న చెప్పాడు. ఈ కార‌ణంగా తాను ఇక‌, ఆంధ్రాజ‌ట్టుకు ఆడేది లేద‌ని తెగేసి చెప్పాడు.

అస‌లు ఏం జ‌రిగింది?

ఈ ఏడాది జ‌రిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ రంజీ సీజన్ తొలి మ్యాచ్‌లో జట్టులోని 17వ ఆటగాడిపై తాను గ‌ట్టిగా మంద‌లించాన‌ని విహారీ పేర్కొన్నాడు అయితే.. స‌ద‌రు ఆట‌గాడు.. త‌న తండ్రి(ఓ నేత‌)కి చెప్ప‌డంతో త‌న‌ను టీంలో నుంచి త‌ప్పించార‌ని విహారీ ఆరోపించాడు. ఈ మేర‌కు ఇన్‌స్టా వేదిక‌గా ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. నేత జోక్యం కార‌ణంగా ఆంధ్రా జట్టు మేనేజ్‌మెంట్ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఆదేశించింద‌న్నాడు.

ఆత్మ‌గౌర‌వం పోయింది!

త‌న ఆత్మ గౌర‌వం పోయింద‌ని విహారీ వ్యాఖ్యానించాడు. తాను చేయ‌ని త‌ప్పున‌కు త‌న‌ను మంద‌లించినంత ప‌నిచేశార‌ని, కెప్టెన్సీ నుంచి తీసేశార‌ని పేర్కొన్నాడు. తాను అంకిత భావంతో ఆంధ్రా జ‌ట్టుకు ప‌నిచేశాన‌ని.. క్రీడ‌లో భాగంగా స‌ద‌రు క్రీడాకారుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాన‌ని.. దీనిని రాజ‌కీయంగా వినియోగించుకుని త‌న‌ను కెప్ట‌న్సీ నుంచి తీసేయ‌డం చాలా బాధాక‌ర‌ణ‌మని వ్యాఖ్యానించాడు. ఇది ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన విష‌యంగా పేర్కొన్నాడు. ఇక పై తాను ఆంధ్ర జ‌ట్టు ఆడ‌బోన‌ని తేల్చి చెప్పాడు. కానీ, దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. అధికార పార్టీ నేత వైపు ప్ర‌తిప‌క్షాల వేళ్లు చూపిస్తున్నాయి. మ‌రి దీనిపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.