సోషల్ మీడియాలో పాపులర్ అయిన.. కుమారీ ఆంటీ హోటల్ మూత పడింది. ఎక్కడెక్కడి నుంచో ఆమె హోటల్‌కు కస్టమర్లు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబర్లు.. చేసిన వీడియోలు, రీల్స్‌తో కుమారి హోటల్ ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిపోయింది. కేవలం నాన్ వెజ్ రెసిపీలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే కుమారి.. అన్ని రకాల కూరలను వేడివేడిగా వడ్డించడం.. కలగలుపుగా అందరితోనూ నాన్నా.. అమ్మా.. తమ్ముడు
అంటూ.. పలకరించడతో ఆమె బాగా ఫేమస్ అయ్యారు.
దీంతో పెద్ద ఎత్తున నాన్ వెజ్ ప్రియులు ఆమె హోటల్‌కు క్యూ కట్టేవారు. ఇక, కస్టమర్లను ఆకట్టుకున్న కుమారి.. అదేసమయంలో ధరలను అమాంతం పెంచేశారనే టాక్ వచ్చింది. మొదట్లో 100కే నాలుగు రకాల కూరలతో అన్నం పెట్టిన కుమారి.. తర్వాత.. అదే నాలుగు రకాలకు 200 నుంచి 350 వరకు కూడా రేటు పెంచేసింది. అయినా.. యూట్యూబ్ మహిమతో కస్టమర్లకు కొదవ లేకుండా పోయింది. అయితే.. ఇదే ఇప్పుడు ఆమెకు సంకటంగా మారింది.
మధ్యాహ్నం 11గంటలకే కుమారీ ఆంటీ హోటల్‌కు ఫుడ్ ప్రియులు తరలి రావడం ప్రారంభించారు. మధ్యాహ్నం 1గంట పీక్ సమయంలో అయితే.. తోపులాటలు కూడా జరుగుతున్నాయి. తాజాగా రెండు రోజుల నుంచి హోటల్ ఉన్న చోట జనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనిని గమనించిన పోలీసులు ఆమెను ఇప్పటికే రెండు సార్లు హెచ్చరించారు. అయినాఫలితం లేకపోవడంతో తాజాగా బండిని సీజ్ చేశారు. ఫైన్ కూడా రాశారు. కేసు కూడా నమోదు చేశారు. దీంతో కుమారీ ఆంటీ హోటల్ మూతబడింది.
యూట్యూబ్‌పై ఆరోపణలు..
తన హోటల్ మూతబడడానికి సోషల్ మీడియానే కారణమంటూ.. కుమారీ ఆంటీ రుసరుసలాడింది. విపరీత ప్రచారంతోనే తన హోటల్‌కు జనాలు పోటెత్తారని.. దీంతో మొత్తానికే ఎసరొచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ క్రమంలో యూట్యూబర్లపై తిట్ల దండకం అందుకున్నారు.
వైసీపీ వర్సెస్ జనసేన..
ఇక, కుమారీ ఆంటీ హోటల్ మూతబడి.. ఆమె ఆవేదనలో ఉంటే.. ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు జగనన్న ఇచ్చిన ఇల్లు తప్ప మరే ఆధారం లేదని.. ఓ యూట్యూబర్‌కు కుమారి ఆంటీ చెప్పింది. దీనిని ప్రస్తావిస్తూ.. వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. జగనన్నపై అభిమానం ఉన్నందునే ఆమెపై కక్ష కట్టిన టీడీపీ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి.. హోటల్‌ను సీజ్ చేయించిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా.. జనసేన ఎదురు దాడి చేసింది. కష్టంలో ఉన్న మహిళను ఆదుకుని సానుభూతి చూపించాల్సిన పరిస్థితిని వదిలేసి ఇలా కామెంట్లు చేయడానికి సిగ్గులేదా? అని జనసేన నాయకులు ప్రశ్నించారు.