నిత్యం వందలాది కార్లు.. ఇసుక వేసినా రాలనంతగా జనాలు.. ఎటు చూసినా హడావుడే.. కాలు కదపాల న్నా.. ట్రాఫిక్ జామ్‌లే. ఇదీ.. హైదరాబాద్ ఉరఫ్ భాగ్యనగరం గురించి.. రెండు ముక్కల్లో చెప్పే మాట. మరి ఇలాంటి నగరం.. ఇప్పుడు పలకరించేవారు లేక బోసిపోతోంది. ప్రధాన పట్టణాలు, నియోజకవర్గాలు, ప్రాంతాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇళ్లకు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడా అలజడి లేదు… చాయ్ కొట్ల దగ్గర సందడి అసలే లేదు.
మనిషిని మనిషి రాసుకుంటేనే తప్ప.. కాలు కదపలేని బేగం బజార్.. క్రికెట్ మైదానంగా మారిపోయింది. రోడ్డు దాటాలంటేనే గుండెలు చిక్కబట్టుకునే ఖైరతాబాద్ జంక్షన్‌లో చిన్నారులు సైకిళ్లు తొక్కుకుంటు న్నారు. రద్దీతో.. హారన్ల మోతతో దద్దరిల్లే.. కూకట్‌పల్లి జంక్షన్.. వాహనాలు లేక.. ఎవరూ రాక.. బోసిపోయిం ది. ఇదీ.. ఇతమిత్థంగా.. హైదరాబాద్ పరిస్థితి. సంక్రాంతిని పురస్కరించుకుని.. భాగ్యనగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. నిత్యం పనులతో బిజీబిజీగా గడిపే నగర జనం.. పల్లె బాట పట్టింది.
హైదరాబాద్‌లోని ప్రతి ప్రాంతంలోనూ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. ప్రధానంగా ఎంతో బిజీగా ఉండే ఐటీ కారిడార్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, అమీర్ పేట్ ప్రధాన జంక్షన్‌ల వద్ద రోడ్లు పరదాలు కప్పుకొన్నట్టుగా ముచ్చటగా కనిపిస్తున్నాయి. జనం అలికిడి.. వాహనాల సవ్వడి లేక.. రహదారులన్నీ.. మౌనంగా కూర్చున్న మునుల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. అప్పుడప్పుడు వచ్చి పోయే ఒకటి రెండు వాహనాలు తప్ప రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు.
ఇక, దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇళ్లకుతాళాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగాల కోసం వచ్చిన వారు.. స్థిరపడ్డవారు.. ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వచ్చినవారు.. చదువుకుంటున్నవారు.. ఇలా అన్ని వర్గాల వరకు.. సొంతూరి బాటపట్టారు. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం. ఏపీవైపే మెజారిటీ ప్రజలు వెళ్లారని తెలుస్తోంది. హైదరాబాద్-విజయవాడ రూటు ఇప్పటికీ బిజీగానే ఉందని తెలుస్తోంది. దీంతో భాగ్యనగరి బోసి పోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates