ఇంటి కోసం.. ఆ ఇంట్లో ఆరుగురిని చంపేశాడు

కలలో కూడా ఊహించలేని దుర్మార్గమిది. ఒక ఇంటి మీద కన్నేసి.. ఆరుగురిని చంపేసిన ఆరాచక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. స్నేహితుడి ఇంటిని సాంతం చేసుకోవటానికి.. ఆ ఇంట్లోని ఆరుగురిని హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. వరస పెట్టి సాగుతున్న హత్యల పరంపర మీద ఫోకస్ చేసిన పోలీసులు ఒక్కొక్క హత్య వెనకున్న మిస్టరీని చేధించగా ఈ ఆరాచక ఉదంతం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆరు హత్యల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని మాక్లుర్ కు ప్రసాద్ కుటుంబం ఉండేది. గతంలో వారంతా గ్రామాన్ని వదిలేసి.. మాచారెడ్డికి వెళ్లిపోయి.. స్థిరపడింది. ప్రసాద్ కు భార్య.. ఇద్దరు పిల్లలు.. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడి పేరు ప్రశాంత్. అతడు మాక్లుర్ లోని ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలన్న దురాశ ఉండేది. తన ప్లాన్ లో భాగంగా లోన్ ఇప్పిస్తానని చెప్పి.. అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.

ముందుగా అనుకున్న ప్రకారం ఆ ఇంటికి బ్యాంక్ లోన్ రాలేదు. దీంతో.. ఇంటిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ మీద ఒత్తిడి తెచ్చాడు ప్రసాద్. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా ప్రసాద్ ను బయటకు తీసుకెళ్లాడు. నిజామాబాద్ – కామారెడ్డి నేషనల్ హైవే మీద అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. ఆ తర్వాతి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి.. ఆమెను బయటకు తీసుకెళ్లాడు.

ఆమెను కూడా హత్య చేసి.. బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేసి.. వారి ఇద్దరి పిల్లలను హత్య చేశాడు. చివరకు ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేశాడు. ఇలా ఒక ఇంటి కోసం ఆరుగురిని హత్య చేసిన ప్రశాంత్ వయసు ఇరవై ఏళ్లు కావటం గమనార్హం. మొదటి మూడు హత్యలు ప్రశాంత్ ఒక్కడే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన మూడు హత్యల్ని మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

హత్యకు గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతోఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే ఇంతలా హత్యలు చేయటాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేని పరిస్థితి. గ్రామంలోని ఒక ఇంటి కోసం ఒక కుటుంబం మొత్తాన్ని అంతమొందించిన కర్కసత్వం గురించి తెలిసిన వారంతా నోట మాట రాలేని పరిస్థితి. మనుషులు మరీ ఇంత దారుణంగా మారిపోతారా? అన్న మాట ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా మాట్లాడుకుంటున్నారు.