షాకింగ్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్!

ప్రపంచ క్రికెట్ ప్రియుల అభిమాన లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ కు ఇంకో నాలుగు నెలల సమయం ఉండగా.. ఒక ఆసక్తికర అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ ను మార్చేసినట్లు సమాచారం. ముంబైని ఐదు సార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ సారధిగా నియమించినట్లు ఓ వార్త ఈరోజు సాయంత్రం నుంచి హల్ చల్ చేస్తోంది. ఇంకా ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ముంబై కెప్టెన్సీ మార్పు మాత్రం పక్కా అని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. గత రెండు సీజన్లో గుజరాత్ టైటాన్స్ ను నడిపించిన హార్దిక్ పాండ్య ఇటీవలే తిరిగి తన పాత జట్టు ముంబైలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

భవిష్యత్తులో కెప్టెన్ ను చేసే ఉద్దేశంతోనే హార్దిక్ పాండ్యను ముంబై తిరిగి జట్టులోకి తీసుకున్నట్లుగా అప్పుడే వార్తలు వచ్చాయి. కానీ ఆ పని ఈ సీజన్ కే చేస్తారని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ కెరీర్ ఇప్పుడే ముగిసిపోతుందని ఎవరికీ అంచనాలు లేవు. అతడికి ప్రస్తుతం 36 ఏళ్లే. ప్రస్తుతం రోహిత్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇటీవల వన్డే ప్రపంచ కప్ లో కెప్టెన్ గా బ్యాట్స్మెన్ గా రాణించాడు. ఇదే ఊపు ఐపిఎల్ లోను కొనసాగిస్తాడనీ, ఇంకో మూడు నాలుగు ఏళ్ళు ముంబై కెప్టెన్ గా కొనసాగుతాడని అభిమానులు ఆశించారు. కానీ ఇంతలోనే హార్దిక్ పాండ్యను ముంబై కెప్టెన్ గా ఎంపిక చేయడం వారికి పెద్ద షాకే.

తమకు ఐదు కప్పులు అందించిన రోహిత్ ను ముంబై కావాలని పక్కన పెట్టే అవకాశం లేదు. బహుశా ఇక సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని, జట్టును కొత్త కెప్టెన్ చేతుల్లోకి పెట్టాలని భావించి ఉండవచ్చు. ఈ మేరకు పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు జరిగి ఉండొచ్చు. కానీ రోహిత్ అభిమానులకు మాత్రం ఈ పరిణామం పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు. రోహిత్ తీరు చూస్తుంటే అతను అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదు. త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదేమో.