భ‌యం గుప్పిట బాప‌ట్ల‌.. అల్ల‌క‌ల్లోలంగా తీరం

మిచౌంగ్ తుఫాను ప్ర‌భావంతో ఏపీలోని స‌ముద్ర తీర జిల్లా బాప‌ట్ల భ‌యం గుప్పిట‌లో బిక్కుబిక్కుమంటోంది. స‌ముద తీరం అల్ల‌క‌ల్లోలంగా మారింది. మిచౌంగ్ తుఫాను.. బాప‌ట్ల స‌మీపంలోనే తీరం దాట‌డంతో ఇక్క‌డ తుఫాను ప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తోంది. పెనుగాల‌లు గంట‌కు 100 నుంచి 120 కిలో మీట‌ర్ల వేగంతో వీస్తున్నాయి. మ‌రోవైపు.. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ.. పీక‌ల్లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ నుంచి అతి భారీ వ‌ర్షాల‌తో జిల్లా వ్యాప్తంగా.. ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట బ‌తుకుతున్నారు.

ముఖ్యంగా తుఫాను ప్ర‌భావంతో.. విద్యుత్ స్తంభాలు.. ఏళ్ల‌నాటి వృక్షాలు కూడా నేల‌కొరిగాయి. పెనుగాల‌లు ప్ర‌భావంతో ఇళ్ల‌పై రేకుల క‌ప్పులు ఎగిరిపోవ‌డంతో ప్ర‌జ‌లు వ‌ర్ష‌పు నీటిలోనే నానిపోయారు. అధికారులు అప్ర‌మ‌త్త‌మై.. వారిని శిబిరాల‌కు త‌ర‌లించారు. అదేస‌మ‌యంలో ర‌హ‌దారులు ఎక్క‌డిక‌క్క‌డ మునిగిపోవ‌డం, క‌ల్వ‌ర్టులు కూలిపోవ‌డం.. రోడ్లు కొట్టుకుపోవ‌డంతో వంద‌ల కిలోమీట‌ర్ల మేర‌.. రోడ్లు దెబ్బ‌తిని.. సాధార‌ణ జ‌న‌జీవ‌నం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. భారీ వ‌ర్షంతో కోత‌కు వ‌చ్చిన వ‌రి, వేరు శ‌న‌గ పంట‌లు పూర్తిగా మునిగిపోయాయి.

మంగ‌ళ‌వారం అర్ధరాత్రి వరకు ఇదే వేగంతో గాలులు, వర్షాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వరి, వాణిజ్య, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి భారీ వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా స‌ముద్ర తీరంలో అల‌లు రెండు నుంచి 4 మీట‌ర్ల ఎత్తున ఎగిసి ప‌డుతున్నాయి. తుఫాన్‌ ఎఫెక్ట్‌తో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు.

మ‌రోవైపు మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లా తూర్పు మండలాలు అల్లాడుతున్నాయి. ఎస్‌ఆర్ పురం, కార్వేటినగం, గంగాధర నెల్లూరు మండలాల్లో వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. సుమారు 15 గ్రామాలకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుపక్కల లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించారు. వర్షాలకు వరి, ఇతర పంటలు నీట మునిగాయి. జిల్లా పడమటి మండలాల్లో జడి వానకు పొలాల్లోనే వరి మగ్గి మొలకెత్తుతుండంతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది.

న‌గ‌రాలూ.. నీటిలోనే..
విజ‌య‌వాడ‌, తిరుప‌తి, విశాఖ‌, రాజ‌మండ్రి, గుంటూరు న‌గ‌రాల్లోనూ మిచౌంగ్ తుఫాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఈ న‌గ‌రాల్లో మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి జోరున వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రోవైపు చ‌లిగాలుల తీవ్ర‌త కూడా పెరిగిపోయింది. దీంతో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప్ర‌వేటు కార్యాల‌యాల‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కే మూసివేశారు. అన్ని స్కూళ్ల‌కు మంగ‌ళ‌వారం సెల‌వు ప్ర‌క‌టించారు.