విడాకుల వివాదం.. వేల కోట్లు నష్టపోతున్న రేమండ్

వ్యాపారం వేరు. వ్యక్తిగతం వేరు అని పలువురు చెబుతుంటారు. కానీ.. ఈ వాదన అన్నిసార్లు సరైనది కాదు.కొన్నిసార్లు వ్యక్తిగత అంశాలు వ్యాపారం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ప్రముఖ రేమండ్ సంస్థ ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

రేమండ్ ఛైర్మన్.. ఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో వైవాహిక సంబంధానికి ముగింపు పలుకుతున్న వేళలో.. వారి మధ్య వివాదం ఆ స్టాక్ మీద తీవ్రంగా ఉందని చెప్పాలి. విడాకుల మీద గౌతమ్ సింఘానియా ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ లో రేమండ్ స్టాక్ చిగురుటాకులా వణుకుతోంది. వివాదం తెర మీదకు వచ్చిన పన్నెండో సెషన్ నాటికి రేమండ్ షేర్ ఏకంగా 14 శాతం పడిపోవటం గమనార్హం.

గడిచిన ఆరు రోజులుగా రేమండ్ షేర్ వాల్యూ 10 శాతానికి పైనే పడిపోయింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి అత్యదిక నష్టాల్ని ఎదుర్కొంటోందన్న మాట వినిపిస్తోంది. రేమండ్ షేర్ పతనంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10వేల కోట్ల దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కేవలం 12 సెషన్లలోనే రేమండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,500 కోట్ల రూపాయిలకు పడిపోవటం ఆందోళనకు గురి చేసేలా మారిందని చెప్పాలి. సింఘానియా.. నవాజ్ మోడీల మధ్య సెటిల్ మెంట్ యుద్ధం కోర్టుకు వెళితే..రేమండ్ షేర్ హోల్డర్లు నష్టపోయే ప్రమాదం ఉందన్న మాట నిపుణుల నోట వినిపిస్తోంది.

నవంబరు 10న ఈ షేరు ధర రూ.1889 ఉండగా.. నవంబరు 30 నాటికి దీని ధర రూ.1502గా ఉంది. ఏ రోజుకు ఆ రోజు ఈ షేరు నేల చూపులు చూడటమే తప్పించి.. పైకి లేచిందే లేదు.వ్యాపారంలో ఒడిదుడుకులు మామూలే అయినప్పటికీ.. దాదాపు మూడు వారాలుగా ఆ షేరు క్రమంగా క్షీణించటమే కానీ.. ఒక్క సెషన్ లోనూ పైకి వెళ్లింది లేదు. ఈ పరిణామాలు షేర్ హోల్డర్లను ఆందోళనకు గురి చేస్తోంది.

గౌతమ్- నవాజ్ లు విడిపోతే రేమండ్ మార్కెట్ వాల్యూ మీదా.. ఆస్తుల మీదా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న వేళలో.. గౌతమ్ సింఘానియా కంపెనీ బోర్డుకు.. ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ రేమండ్ వ్యాపారం నిర్వారామంగా కొనసాగుతుందన్న భరోసాను ఇచ్చారు. నవాజ్ మీద వస్తున్న ఆరోపణలకు బదులు ఇవ్వని ఆయన మౌనంగా ఉండటాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ.. ఆయన లేఖ రాశారు.

ఉద్యోగులు.. బోర్డు సభ్యులకు పంపిన అంతర్గత ఈమొయిల్లో తన వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న సవాల్లు రేమండ్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవంటున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవటమే తనకు ముఖ్యమన్న ఆయన.. దానిపై తాను స్పందించనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేమండ్ స్టాక్ మీద ఎంత ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.