విదేశాల్లో పెళ్లిళ్లా? సెలబ్రిటీలకు షాకిచ్చిన మోడీ

తాను గురి పెట్టింది ఎవరిపైన అన్నదాన్ని పట్టించుకోరు ప్రధాని నరేంద్ర మోడీ. తాను టార్గెట్ చేసిన అంశానికి కోట్లాది మందిని టచ్ చేసిందా? లేదా? అన్నదే ఆయన లెక్క. తాజాగా మన్ కీ బాత్ లో పలు అంశాలపై తనకున్న అభిప్రాయాల్ని దేశ ప్రజలతో పంచుకున్నారు మోడీ.

ఈ ఆదివారం చేసిన మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన ఒక అంశం దేశంలోని బడా బాబులకు.. పారిశ్రామికవేత్తలకు.. సినీ స్టార్లతో పాటు.. సెలబ్రిటీలకు షాకిచ్చేలా ఉందని చెప్పాలి. డెస్టినేషన్ మ్యారేజ్ లో భాగంగా దేశంలోని ధనవంతులు.. సెలబ్రిటీలు.. ప్రముఖులు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటం.. వేడుకల్ని నిర్వహించుకునే తీరును తప్పు పట్టారు.

ఈ పెళ్లిళ్ల సీజన్ లో దేశ వ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారుల అంచనా వేస్తున్నారని.. పెళ్లి షాపింగ్ లో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. “చాలా కాలంగా పెళ్లి కోసం ఇతర దేశాలకు వెళ్లటం నన్ను కలవరపెడుతోంది. దీని గురించి నా దేశ ప్రజలతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను? విదేశాల్లో పెళ్లి చేసుకోవటం అవసరమా? దాని గురించి మీరంతా ఒకసారి ఆలోచించాలి. పేద కుటుంబాల వారు తమ పిల్లలకు లోకల్ ఫర్ వోకల్ ప్రాధాన్యం గురించి చెబుతున్నారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ఉన్నత కుటుంబాల వారు దీని గురించి ఆలోచించాలి” అంటూ సూటిగా తగిలేలా చురకలు వేశారు.

విదేశాల్లో కాకుండా భారత్ లో పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల లోకల్ ఫర్ వోకల్ కు ఎంతో మద్దతు ఇచ్చినట్లు అవుతుందన్న మోడీ మాటలు ఎగువ మధ్యతరగతి.. మధ్యతరగతి.. పేదలు.. నిరుపేదల్ని తీవ్రంగా ఆకర్షించటమే కాదు.. తన తాజా వ్యాఖ్యలతో సెలబ్రిటీలు.. సంపన్నులు.. పారిశ్రామికవేత్తలకు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటానికి వీల్లేని లక్ష్మణరేఖను గీశారని చెప్పాలి. ప్రధాని మోడీ నోటి నుంచి ఇంత వివరంగా విదేశాల్లో పెళ్లి చేసుకోవటంపై తనకున్న అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఏ ప్రముఖుడైనా విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవటానికి సాహసిస్తారా? అన్నది చర్చగా మారింది. ఏమైనా.. విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవటం తప్పు అన్న రీతిలో మోడీ నుంచి వచ్చిన మాటలు.. రానున్న రోజుల్లో కొత్త చర్చకు తెర తీసిందని మాత్రం చెప్పక తప్పదు.