విశాఖ హార్బర్ లో ఆగ్ని ప్రమాదం..40 బోట్లు దగ్ధం

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎన్నడూ జరగని భారీ అగ్నిప్రమాదం జరిగిన వైనం ఏపీలో సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో వరుసగా ఒకదాని తర్వాత మరో బోటుకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. హార్బర్ లోని ఒకటో నెంబర్ జెట్టి దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

కళ్ళెదుటే తమ జీవనాధారం బూడిదవతుంటే మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బోట్ లలో నిల్వ ఉంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ పేలి మంటలు మరింత తీవ్రంగా మారాయి. అయితే, ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ ఓటమి తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆకతాయిలు కొందరు కావాలనే బోట్లకు నిప్పుపెట్టి ఉంటారని మత్స్యకార బోట్ల సంఘ నాయకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాధితులను ఆదుకోవాలని, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండి తగిన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దాదాపు 40 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.