పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ షాక్!

2023 క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో, ఇంటా బయటా దాయాది జట్టు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్ ఆటగాళ్లను పాక్ మాజీ క్రికెటర్లు ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే పాక్ జట్టుపై ట్రోలింగ్ ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఇక, ప్లేయర్ గా కూడా బాబర్ అతడి స్థాయికి తగ్గట్లు ఆడలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది.

ఆ పుకార్లకు తగ్గట్లుగానే పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ పదవి నుంచి వైదొగులుతున్నట్లు బాబర్ ఆజమ్ ఈ రోజు అధికారికంగా ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. బాబర్ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోవడం కూడా పాక్ అభిమానులకు మింగుడుపడటం లేదు. 2019లో పాక్ జట్టుకు నాయకత్వం వహించాలని పీసీబీ నుంచి పిలుపువచ్చిందని, ఆ క్షణం నుంచి ఇప్పటి దాకా మైదానం లోపల, వెలుపల చాలా ఎత్తుపల్లాలను చూశానని చెప్పాడు.

పాకిస్తాన్ ప్రతిష్టను కాపాడటమే లక్ష్యంగా మనస్ఫూర్తిగా అనుకున్నానని, అందుకు శాయశక్తులా కృషి చేశానని చెప్పాడు. తాను వన్డేలలో నంబర్ 1 స్థానానికి చేరుకోవడంలో ఆటగాళ్లు, కోచ్, ఇతర జట్టు మేనేజ్మెంట్ సమిష్టి కృషి ఉందని అన్నాడు. పాక్ క్రికెట్ అభిమానులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పాడు. కెప్టెన్సీకి రాజీనామా చేయడం చాలా కష్టమైన నిర్ణయం అని, కానీ, అదే సరైన నిర్ణయం అని భావిస్తున్నానని ఎక్స్(ట్విట్టర్)లో బాబర్ అజమ్ పోస్ట్ చేశారు.