కేఏల్ రాహుల్ ఫాస్టెస్ట్ సెంచరీ

క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ మెగాటోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా భారత్ సెమీఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నెదర్లాండ్స్ తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డచ్ బౌలర్లను ఊచకోత కోసిన భారత బ్యాటర్లు 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు సాధించారు.

ఈ క్రమంలోనే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా తరఫున వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ పేరుతో ఉన్న ఈ రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ కూడా ఇదే ప్రపంచ కప్ లో లో అఫ్ఘానిస్థాన్ పై 63 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం విశేషం. నెదర్లాండ్స్ పై రాహుల్ 62 బంతుల్లోనే సెంచరీ సాధించి రోహిత్ రికార్డు బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ 61, గిల్ 51 , విరాట్ కోహ్లీ 51 ఇలా ముగ్గురు అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ రోజు కోహ్లీ 50వ సెంచరీ చేస్తాడు అనుకుంటుండగా వాన్ డి మర్వ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో అజేయంగా 128 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 102 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. ఈ క్రమంలోనే 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.

శ్రేయస్ అయ్యర్ తో కలిసి కేఎల్ రాహుల్ 228 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రపంచ కప్ లో నాలుగో వికెట్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఇక, ప్రపంచకప్ లో టీమిండియాకు ఇది రెండవ అత్యధిక స్కోరు. గతంలో బెర్ముడాపై భారత జట్టు 413 పరుగులు చేసింది. ఇక, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్లో అత్యధిక సిక్సర్లు(59) బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 58 సిక్సర్లతో ఇప్పటివరకు ఏబీ డివిల్లియర్స్ పేరిట ఈ రికార్డు ఉంది.